స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆనందోత్సాహాలతో గడిపిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురయ్యింది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
ప్రమాదం ఏ క్షణాన ఎలా ముంచుకొస్తుందో తెలీదు. ఊహించని ప్రమాదం కుటుంబాలను విషాదంలోకి నెట్టి వేస్తుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని మిగుల్చుతాయి. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని పాఠశాల నుంచి ఇళ్లకు తిరుగు పయనమైన విద్యార్థులు ప్రమాదం భారిన పడ్డారు. విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్న స్కూల్ బస్సు మార్గమధ్యలో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం ఏపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు గాయపడగా, ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.