ప్రేమ ఎవ్వరితో, ఎలా, ఏ వయస్సులో పుడుతుందో ఈ రోజుల్లో అయితే చెప్పడం కష్టం. యుక్త వయస్సు మొదలుకుని ముదసలి వరకు ప్రేమ ఫీలింగ్స్‌కు మంత్ర ముగ్దులవుతున్నారు. ప్రేమకు వయస్సుతో కూడా సంబంధం ఉండటం లేదు
ప్రేమ ఎవ్వరితో, ఎలా, ఏ వయస్సులో పుడుతుందో ఈ రోజుల్లో అయితే చెప్పడం కష్టం. యుక్త వయస్సు మొదలుకుని ముదసలి వరకు ప్రేమ ఫీలింగ్స్‌కు మంత్ర ముగ్దులవుతున్నారు. ప్రేమకు వయస్సుతో కూడా సంబంధం ఉండటం లేదు. తనకన్నా వయస్సులో చాలా పెద్దదైన మహిళల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు యువకులు. అలాగే తన తండ్రి వయస్సు ఉన్న వ్యక్తులను ప్రేమిస్తున్నారు యువతులు. ఈ కల్చర్ సెలబ్రిటీ నుండి సామాన్యుల వరకు పాకింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే లవ్ స్టోరీ మాత్రం లేటు వయస్సులో ఘాటు ప్రేమే. అయితేనేం తమకు ఇప్పుడే ప్రేమ పుట్టిందంటున్నారు ఈ జంట. కలిసుండేందుకు మాకు లేని అభ్యంతరం మీకెందుకు అంటున్నారు. ఇంతకు ఆ ప్రేమికుల వయస్సు ఎంతంటే ప్రియుడికి 76, ప్రేమికురాలికి 46 ఏళ్లు.
ఈ వృద్ద ప్రేమ జంటది ఒడిశాలోని గంజాం జిల్లా. సంఖేముండి బ్లాక్ పరిధిలోని అడపాడ గ్రామానికి చెందిన రామచంద్ర సాహు (76) సురేఖ సాహు (46)ని వివాహం చేసుకున్నాడు. వీరిది ఎనిమిదేళ్ల ప్రేమ. వివరాల్లోకి వెళితే.. రామచంద్రకు గతంలో పెళ్లి అయ్యింది. అతడికి ఇద్దరు పిల్లలు. అయితే మొదటి భార్య చనిపోయింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి కూడా చేశాడు. రామచంద్ర గత 50 ఏళ్లుగా మోహన బ్లాక్ పరిధిలోని సికులిపాడు పంచాయతీ పరిధిలోని తాళసింగ్ గ్రామంలో చిన్నపాటి వ్యాపారం చేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం రామచంద్ర భంజానగర్ ప్రాంతంలోని కులాడ్ గ్రామంలోని ఓ వేడుకలో సురేఖను మొదటిసారి కలిశాడు. తొలి చూపు నుండి ఆమెను ప్రేమిస్తున్నాడు. సురేఖకు పెళ్లి కాలేదు. ఇద్దరి మధ్య మాటలు పెరిగి, ఫోన్ నంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. చివరగా, రామచంద్ర.. సురేఖ ముందు పెళ్లి ప్రతిపాదన పెట్టగా.. ఆమె అంగీకరించింది. ఈనెల 19న భంజానగర్ కోర్టులో సురేఖ తండ్రి, సోదరుడు, మేనల్లుళ్లు, మేనకోడళ్ల సమక్షంలో వివాహం జరిగింది. ఆ తర్వాత గుడిలో ఆచారాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు.