పురాతన కాలంలో కొంత మంది మహిళలు దేవుళ్లను ఆరాధిస్తూ.. వారి భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయేవారు. అయితే తమ ఇష్టదైవాన్ని భర్తగా భావించి..వారినే పూజిస్తూ, స్మరిస్తూ.. తనువు చాలించి చరిత్రలో నిలిపోయారు కొంత మంది మహిళలు. ఆ కోవకే వస్తారు మీరాభాయ్.
పురాతన కాలంలో కొంత మంది మహిళలు దేవుళ్లను ఆరాధిస్తూ.. వారి భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయేవారు. అయితే తమ ఇష్టదైవాన్ని భర్తగా భావించి..వారినే పూజిస్తూ, స్మరిస్తూ.. తనువు చాలించి చరిత్రలో నిలిపోయారు కొంత మంది మహిళలు. ఆ కోవకే వస్తారు మీరాభాయ్. కృష్ణుడిని భర్తగా భావించి, ఆయనను ఆరాధిస్తూ, కవితలు రాస్తూ.. నిత్మ స్మరణ చేస్తూ గడిపింది. అయితే అది గతం. కానీ నేటి సమాజంలో ఇలాంటి మహిళలు ఉన్నారా అంటే చాలా అరుదు. వివాహం పట్ల విరక్తో లేక దేవుడిపై భక్తితోనే కొంత మంది మహిళలు మాత్రం వినూత్నమైన పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులు శ్రీ కృష్ణ పరమాత్ముడ్ని, శివుడ్ని వివాహమాడిన సంగతి విదితమే. తాజాగా ఇప్పుడు మరో యువతి ఇటువంటి పెళ్లే చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ అరుదైన పెళ్లి జరిగింది. శివుడిపై భక్తిని పెంచుకున్న ఓ యువతి దేవుడ్ని భర్తగా స్వీకరించాలనుకుంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్వాగతించారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ ఘటన ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నపూర్ణ కాలనీకి చెందిన బలరాం, కిరణ్ భార్యా భర్తలు. వీరికి నలుగురు పిల్లలు కాగా, వారికి గోల్డీ అనే కుమార్తె ఉంది. వారి కుటుంబం మొత్తం బ్రహ్మకుమారి సంస్థలో పనిచేస్తున్నారు. గోల్డీ తండ్రి బలరాం పోస్టాఫీసులో డిప్యూటీ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. తల్లి కిరణ్ గృహిణి. ఆమెకు అన్నయ్య రాహుల్, సిస్టర్స్ నిని, నాన్సీ ఉన్నారు. ఈ క్రమంలో శివునిపై ప్రేమను పెంచుకున్న గోల్డీ అతడిని వివాహం చేసుకోవాలనుకుంది. అందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో శ్రావణ మాసంలో వివాహం జరిపించారు. ఈ పెళ్లిని సాదాసీదాగా జరిపించలేదు. ధూమ్ ధామ్ ఏర్పాట్లు చేశారు తల్లిదండ్రులు.
పసుపు కొట్టడం, సంగీత్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. పెళ్లి పత్రికలు పంచి, బంధు మిత్రుల సమక్షంలో వివాహ తంతు ముగించారు. ఊరేగింపుగా వెళ్లి శివుడ్ని వివాహమాడింది గోల్డీ. శివుని విగ్రహానికి పూల మాలలు వేసి, ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి.. వివాహం చేసుకుంది. పెళ్లికి వచ్చిన వారికి భోజనాలు సైతం వడ్డించారు. ప్రస్తుతం ఈ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. బికామ్ పూర్తి చేసి ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించింది గోల్డీ. 2016లో ఇండోర్‌లోని బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉంటూ సామాజిక సేవ చేయడం ప్రారంభించింది. మిగతా కుటుంబ సభ్యుల్లాగే.. తన జీవితాన్నంతా సామాజిక సేవకే అంకితం చేయాలని భావించిన యువతి.. రెండు రోజుల క్రితం దేవుణ్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చి తల్లిదండ్రులతో పంచుకోవడంతో.. ఈ తంతు జరిగింది.