కొన్ని సార్లు చాలా చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ ఓ కుక్క దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషులకే దిక్కు లేదంటే.. కుక్కలకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఏంటండీ పిచ్చి కాకపోతే అని అనుకుంటున్నారా? కానీ నిజంగానే తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటూ ఒక దరఖాస్తు అయితే అధికారుల చేతులకు వెళ్ళింది. అంతేకాదండోయ్ ఆ కుక్క చదువుకుంటుందట. తల్లిదండ్రులు ఉన్నారని.. తనకు ఆధార్ కార్డు కూడా ఉందని.. ఆ ప్రూఫ్ ఆధారంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ కుక్క దరఖాస్తు చేసుకోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఈ విచిత్రమైన ఘటన బీహార్ లోని గయా పట్టణంలో చోటు చేసుకుంది.
అధికారులు ఒక కుక్క కుల ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసినట్లు అధికారులు గుర్తించారు. బీహార్ ప్రభుత్వం కులాల ఆధారంగా జనవరి 7 నుంచి రాష్ట్రంలో సర్వే ప్రారంభించింది. జనవరి 21తో సర్వే ముగియడంతో అధికారులు దరఖాస్తులను పరిశీలించారు. సర్వే సమయంలో చాలా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఒక కుక్కకు సంబంధించిన దరఖాస్తు ఒకటి అధికారులను విస్మయానికి గురిచేసింది. టామీ అనే పేరుతో దరఖాస్తు పూరించబడి ఉంది. ఒక ఆధార్ కార్డు కూడా జత చేయబడి ఉంది. ఏప్రిల్ 14 2022న పుట్టినట్టు పుట్టిన తేదీ కూడా ఉంది. పందేపోఖర్ గ్రామం, రౌనా పంచాయితీ, 13వ వార్డు, గురారు సర్కిల్, కొంచ్ పోలీస్ స్టేషన్ అని ఆధార్ కార్డు మీద చిరునామా ఉంది.
ఆధార్ నంబర్ తో పాటు.. ‘ఆధార్ – ఆమ్ కుత్తా కా అధికార్’ అని రాసి ఉంది. మామూలుగా మనుషులకు ఇచ్చే ఆధార్ లో.. ‘ఆమ్ ఆద్మీ కా అధికార్’ అని రాసి ఉంటుంది. మనుషులకు ఇచ్చే గుర్తింపు కార్డు అని, ఒక మనిషికి అధికారికంగా ప్రభుత్వం ధృవీకరించి ఇచ్చిన కార్డు అని దానర్థం. అయితే తనను కుక్కగా గుర్తించి ఆధార్ ఇచ్చినట్లు ఆధార్ కార్డు ఉంది. అంతేనా.. తన తల్లిదండ్రుల పేరు షేరు, గిన్నీ అని రాయబడి ఉంది. ఇక తానొక స్టూడెంట్ అని దరఖాస్తులో పేర్కొనబడి ఉంది. అయితే ఆధార్ కార్డుని రికార్డుల్లో పరిశీలించగా రాజబాబు అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు గుర్తించారు. ఎవరో ఆకతాయిలు కావాలని చేసిన పని అని గుర్తించారు. ఇలా తమ సమయాన్ని వృధా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.