ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ లో ఎయిరిండియాలో ప్రయాణిస్తున్న మహిళపై శంకర్ మిశ్రా అనే ప్రయాణీకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై చర్యలు చేపట్టిన డిసిజిఎ ఈ భారీ జరిమానాను విధించింది.అదేవిధంగా ఈ ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలమైనందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్ కు రూ. 3 లక్షల పెనాల్టీ విధించింది.
గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుండి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానం బిజినెస్ క్లాసులో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు శంకర్ మిశ్రా ప్రయాణించకుండా అతడిపై నాలుగు నెలల పాటు విమానయాన సంస్థ నిషేధం విధించింది. అయితే సిబ్బంది తీరుపై కూడా విమర్శలు రావడంతో ఎయిరిండియా సీరియస్ గా తీసుకుంది. ఆ సమయంలో ఉన్న కెప్టెన్, క్యాబిన్ సిబ్బందిపై కూడా క్రమశిక్షణా చర్యలు చేపట్టిన సంగతి విదితమే. అయితే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు తానేమీ తప్పు చేయలేదని బుకాయించాడు. బాధితురాలిపై నిందలు మోపే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రొస్టేట్ సమస్యతో బాధపడుతుందని, మూత్ర విసర్జన చేసుకుని ఉంటుందని, ఆ వ్యాధితో బాధపడేవారు అలాగే చేసుకుంటారని కోర్టులో పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను బాధిత మహిళ ఖండించింది.