దానం చేయడానికి గొప్ప మనసు ఉండాలి అంటారు. అలాంటి మనసే ఈ బిచ్చగాడికి ఉంది. మనుషులు ఆపదలో ఉంటే తట్టుకోలేడు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో డబ్బులు దానంగా ఇస్తూ వస్తున్నాడు. అతడి కథ ఏంటంటే..!
దానం చేయడానికి ఎంతో గొప్ప మనసు ఉండాలి. మనం సంపాదించే దాంట్లో అన్నీపోగా కొంతైనా దానం చేయాలని పెద్దలు అంటుంటారు. ఆ మతం, ఈ మతం, ఆ దేశం ఈ దేశం అనే తేడాల్లేకుండా అన్నిచోట్లా దానం అనేది ఉంది. దీని వల్ల ఇతరులకు సేవ చేశామనే సంతృప్తి కలుగుతుంది. మనసుకు సాంత్వన కలుగుతుంది. అయితే కొంతమంది డబ్బులు ఉన్నా కూడా దానం చేయడానికి ముందుకు రారు. కానీ ఓ బిచ్చగాడు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయనిధికి ఏకంగా రూ.50 లక్షలను విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆ బిచ్చగాడి పేరే పూలపాండ్యన్ (72). తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌కు 2020 మేలో రూ.10 వేలు దానంగా ఇచ్చాడు పూలపాండ్యన్.
అలాగే వివిధ జిల్లాల్లోని కలెక్టర్లకు రూ.10 వేల చొప్పున ఎనిమిది సార్లు విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం అతడికి కుటుంబం అనేది లేదు. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులను దానం చేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాల్లో మొత్తంగా రూ.50 లక్షలను దానంగా ఇచ్చాడు పూలపాండ్యన్. ఒకప్పుడు అతడికి పెద్ద కుటుంబం ఉండేది. 24 ఏళ్ల కింద భార్య చనిపోయింది. కుమారులు పట్టించుకోకపోవడంతో అతడు వాళ్లకు దూరంగా ఉంటున్నాడు. కరోనా సమయంలో రిలీఫ్ ఫండ్‌కు, శ్రీలంకలో ఉన్న తమిళులకు, వివిధ స్కూళ్లకు పేద విద్యార్థులకు నగదు రూపంలో సాయం చేశాడు. 2020లో మధురై జిల్లా కలెక్టర్ ఆయన దాణ గుణాలు నచ్చి పాండ్యన్‌ను పురస్కారంతో సత్కరించాడు. మరి.. భిక్షాటనతో వచ్చిన డబ్బులను దానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ దానకర్ణుడి కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.