నాన్నమ్మ అంటే మనవడితోనో, మనవరాలితోనో ఆడుకునే వయసు. ఈ వయసులో మనవళ్లతో ఆడుకోవడమో.. తీరిక దొరికినప్పుడు మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు అని బాధపడుతూ ఉంటారు. కానీ జిమ్ చేస్తూ నొప్పులను తరిమికొట్టిన నాన్నమ్మని చూశారా? 56 ఏళ్ల వయసులో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యవంతురాలిని చూశారా? ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆవిడ గురించే. వ్యాయామం చేస్తే ఎలాంటి నొప్పులనైనా తరిమికొట్టవచ్చు అని చెబుతున్న సూపర్ ఉమెన్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు.
జిమ్ అంటే వయసులో ఉన్న వాళ్ళే చేయాలి. జిమ్ లోకి వెళ్లాలంటే బాడీ కనబడేలా డ్రెస్ వేసుకోవాలి, సౌకర్యవంతమైన డ్రెస్ ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు వంద కేజీల కందిపప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చేసే పనిలో సంకల్పం ఉండాలే గానీ దానికి వయసు, సౌకర్యాలు వంటివి అడ్డుకావు. ఈ మాటను నిజం చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమె పేరు కందిప. చెన్నైలో ఉంటారు. 52 ఏళ్ల వయసులో ఆమెకు విపరీతమైన కీళ్ల నొప్పి, కాళ్ళ నొప్పి సమస్యలు వేధించడం మొదలుపెట్టాయి. దీని కోసం ఆమె సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆమె కొడుకుకి విపరీతమైన వెన్ను నొప్పి ఉండడంతో డాక్టర్లు సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారట. కానీ తన కొడుకు సహజమైన ట్రీట్మెంట్ తో వెన్ను నొప్పిని సాధించారట.
ఆయన చెన్నైలో.. మద్రాస్ బార్బెల్ అనే జిమ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. జిమ్ చేయడం ద్వారా ఆయన వెన్ను నొప్పిని తరిమికొట్టారు. కొడుకు దారిలోనే ఆయన తల్లి కూడా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. జిమ్ చేస్తే కాలి నొప్పులు, కీళ్ల నొప్పులు పోతాయని కొడుకు చెప్పడంతో ఆమె 52 ఏళ్ల వయసులో జిమ్ లోకి అడుగుపెట్టారు. అందరూ జిమ్ డ్రెస్సుల్లోనే వస్తున్నారు కదా, తన డ్రెస్ మార్చుకోవాలా అని ఆమె అనుకోలేదు. ఏ మాత్రం సిగ్గు పడకుండా చీరలోనే జిమ్ లో అడుగుపెట్టారు. పవర్ లిఫ్టింగ్, స్క్వాట్స్ వంటి కఠినమైన కసరత్తులు చేయడం ప్రారంభించారు. అసలు 30+ వయసులో ఉన్న యువకులకే ఇలాంటి కసరత్తులు చేయడం కష్టంగా ఉంటుంది.
కానీ ఆమె అమ్మమ్మ వయసులో ఇలా కష్టపడడం అంటే మామూలు విషయం కాదు. అందుకు ఆమె ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆమె ఒక్కర్తే జిమ్ చేయడం కాదు, కోడలితో కలిసి మరీ జిమ్ చేస్తున్నారు. ఇది కదా గొప్ప విషయం. కోడళ్లను సాధించడమే అత్తల పని అనే విధంగా ఉన్న ఈ సమాజంలో కోడలితో కలిసి జిమ్ చేయడం అంటే గొప్ప విషయమేగా. కోడలితో కలిసి కుదురుగా కాసేపు టీయే తాగరు. అలాంటిది గంటలు గంటలు జిమ్ చేయడం అంటే మెచ్చుకోతగ్గ విషయమే. లోకంలో ఉన్న అత్తలు ఈ అత్త గారిని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఆమె వయసు 56. ఇంకా వర్కవుట్లు చేస్తున్నారట. నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయని, తనకిప్పుడు ఎటువంటి కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు లేవని అంటున్నారు.
కుటుంబం మొత్తం జిమ్ చేస్తూ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటున్నామని ఆమె అన్నారు. మనవడితో కలిసి చిన్న పిల్లలా గెంతులేస్తున్నానని ఆమె అన్నారు. అదన్నమాట విషయం. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అమ్మలా వ్యాయాయం చేయాల్సిందే. జిమ్ కి వయసుతో పని లేదు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. ఈ వయసులో జిమ్ చేస్తూ ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని, సూపర్ అమ్మ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్కవుట్లకు సంబంధించిన ఈమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.