ఆడపిల్ల అంటే అక్కడ, ఆ ఇంటి పిల్ల అని అర్ధం. ఈడ పిల్ల కాదు, ఆడ పిల్ల. ఈడ పుట్టింది, ఆడకు వెళ్తుంది. ఆడ అంటే అక్కడ అని అర్ధం. అంటే ఒక ఇంటి బిడ్డ పెళ్ళి చేసుకుని అత్తారింట్లో అడుగుపెడుతుంది. అందుకే ఆ బిడ్డను ఆడబిడ్డ, ఆడపిల్ల అన్నారు. ఆడ ఇంటి పిల్ల కదా అని అత్తారింటి వారికి ఆడ బిడ్డ మీద అన్ని హక్కులూ ఉన్నాయనుకుంటే పొరపాటే. తన జీవితాన్ని తాను నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఒకరి హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదు. ఓ మహిళకు ఓ వ్యక్తితో పెళ్ళయ్యింది. అత్తారింటికి వెళ్లిన కొన్ని రోజులకి పిల్లలు పుట్టారు. మహిళ ఇంటిపేరు, పిల్లల ఇంటి పేరు భర్త ఇంటి పేరే ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దురదృష్టవశాత్తు భర్త చనిపోతే, ఆ మహిళ వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే.. మొదటి భర్తకు పుట్టిన పిల్లలకి ఇంటి పేరు మార్చాలా? మార్చకూడదా? మార్చే హక్కు తల్లిదా? లేక మాజీ అత్తమామలదా? ఇదే ఇప్పుడు సెన్సేషనల్ కేసు. ఈ కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ సంతానం కలిగిన తర్వాత భర్తను కోల్పోయింది. ఆ తర్వాత ఆ మహిళ మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకును రెండో భర్త కుటుంబంతో కలిపేసుకుంది. రెండో భర్త ఇంటి పేరునే మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకుకి పెట్టాలని నిర్ణయించుకుంది. కానీ దీనికి ఆమె మొదటి భర్త తల్లిదండ్రులు అంగీకరించలేదు. మరణించిన తమ కొడుకు సంతానానికి తమ ఇంటి పేరే ఉండాలని కోర్టుకెక్కారు. ఈ కేసు తొలుత ఏపీ హైకోర్టు తీసుకుని విచారణ చేపట్టింది. ఈ విచారణలో రెండో భర్త పేరును సవతి తండ్రిగా రికార్డుల్లో ఎక్కించాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆ బాలుడికి బయలాజికల్ ఫాదర్ లేడు.. కానీ బయలాజికల్ మదర్ ఉంది. అంటే ఆ బాలుడి ఇంటి పేరు నిర్ణయించే హక్కు, దత్తతకు ఇచ్చే హక్కు జన్మనిచ్చిన తల్లికే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ కృష్ణ మురారీల ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. కోర్టు ఈ విషయాలపై జోక్యం చేసుకోవచ్చునని, ఆ బాబు భవిష్యత్తు తప్పితే.. మిగతా కారణాలు ఏవీ కూడా కోర్టు దృష్టిలో పరిగణలోకి తీసుకునేంత ప్రాధాన్యత ఉన్నవి కావని వివరించింది.
ఆ తల్లి రెండో పెళ్లి చేసుకుని తన మొదటి కొడుకును రెండో భర్తకు దత్తత ఇచ్చిందని, తద్వారా ఆ బాలుడి అసలు తండ్రి కుటుంబ బాధ్యతలు, హక్కులు కోల్పోయి.. రెండో తండ్రి కుటుంబ బాధ్యతలు, హక్కులు పొందుతాడని ధర్మాసనం వెల్లడించింది. ఆ బాలుడి ఇంటి పేరు నిర్ణయించే హక్కు సహజ సంరక్షకురాలైన తల్లికే ఉంటుందని తెలిపింది. ఇంటి పేరు వేరుగా పెడితే.. తన రెండో కుటుంబంలో ఆ పిల్లల్ని వేరుగా ఉంచినట్టు అవుతుందని, అది వారి పెరుగుదలపై ప్రతికూల ప్రభావం వేస్తాయని బెంచ్ తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి భర్త చనిపోయాక పిల్లల ఇంటి పేరు మార్చే హక్కు తల్లికే ఉంటుందని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.