న్యూ ఢిల్లీ- నోట్ల రద్దు నుంచి మొదలు మొన్నటి కశ్మీర్ అంశం వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు ఇక మోదీ పని అయిపోయింది అన్నారు చాలా మంది. కానీ తిరిగి రెండోసారి 2019లో మోదీకే పట్టం కట్టారు ప్రజలు. రెండో సారి అధికారంలోకి వచ్చాక కూడా ప్రధాని మోదీ ఆర్ధిక పరమైన అంశాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యంగా జాతీయ బ్యాంకుల విలీనం. కుప్పలు తెప్పలుగా ఉన్న బ్యాంకులన్నింటినీ విలీనం చేసి బ్యాంకింగ్ రంగాన్ని సమూలంగా మార్చేసింది మోదీ సర్కార్.
ఇక ఇప్పుడు మరి కొన్ని జాతీయ బ్యాంకులను వదిలించుకునే పనిలో పడ్డారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టబోతోందని తెలుస్తోంది. బ్యాంకులు ప్రైవేటీకరణ కోసం మోదీ సర్కార్ బ్యాంకింగ్ రెగ్యులైజేషన్స్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ లా యాక్ట్‌కు సవరణలు కూడా చేయనుందని సమాచారం. నీతి ఆయోగ్ ఇప్పటికే రెండు బ్యాంకులను షార్ట్ లిస్ట్ చేసి కేంద్రానికి నివేదికను సమర్పించిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వనీయవర్గాల సమాచారం. ఐతే బ్యాంకుల ప్రైవేటీకరణ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. శాలరీలు, పే స్కేల్, పెన్షన్ వంటి వాటికి సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఆర్ధిక శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. ఐతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల కోసం వీఆర్ఎస్ తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.