మోదీ క్యాబినెట్ లోకి గాంధీ ఫ్యామిలీ సభ్యుడు

న్యూ ఢిల్లీ- కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. 2019 ఎన్నికల్లో రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రధానిగా మళ్లీ పగ్గాలు చేపట్టారు. అప్పుడు ఏర్పాటైన మంత్రివర్గాన్ని విస్తరించాలని మోదీ భావిస్తున్నారు. గత వారం రోజులుగా మోదీ బీజేపీ అగ్ర నేతలతో పాటు, ఆయన సన్నిహిత మంత్రులతోనూ విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. దీంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

varun gandhi

ఇక ఈ సారి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థాన చలనం జరుతుంది, కొత్తగా ఎవరికి బెర్త్ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లోక్‌ జన శక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్, బీజేపీ నేత సురేష్ అంగది దివంగతులు కావడంతో మంత్రివర్గంలో ఓ కేబినెట్ మంత్రి పదవి, ఓ సహాయ మంత్రి పదవి ఖాళీగా ఉన్నాయి. అంతే కాకుండా శిరోమణి అకాలీ దళ్, శివ సేన మంత్రులు రాజీనామా చేయడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు మంత్రి పదవులను ఇప్పుడు భర్తీ చేయాల్సి ఉంది. ఇక క్యాబినెట్ లో ప్రధాని మోదీ ఆశించిన స్థాయిలో పని తీరు కనబరచని కొందరు మంత్రులను పదవుల నుంచి తొలగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకోబోతున్నవారిగా ప్రచారంలో ఉన్న పేర్లలో ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీకి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరో తొమ్మిది నెలల్లో ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ మందికి కేంద్ర క్యాబినెట్ లో అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మధ్య ప్రదేశ్ యువ నేత జ్యోతిరాదిత్య సింథియాకు కూడా కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ ఖాయమైనట్లు సమాచారం.