స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అడుతున్న కేఎస్ భరత్ రెండో మ్యాచ్ లోను తన సత్తా చూపించాడు. దుబాయ్ వేధికగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కేఎస్ భరత్ 35 బంతుల్లో 44 రన్స్ చేశాడు. దీంతో బెంగళూరు జట్టు విజయంలో కేఎస్ భరత్ కీలకంగా మారాడు. కేవలం 35 బంతుల్లో 3×4, 1×6 తో 44 పరుగులు చేసి ఐరా అనిపించాడు.
ప్రధానంగా మ్యాచ్ లో భాగంగా 150 పరుగుల ఛేదనలో విరాట్ కోహ్లీ (25) ఔటైన తర్వాత మాక్స్‌వెల్ (50 నాటౌట్) తో కలిసి మూడో వికెట్ కి కేఎస్ భరత్ నెలకొల్పిన 69 పరుగుల భాగస్వామ్యం రాజస్థాన్ కి మ్యాచ్‌ని దూరం చేయడంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయానికి దోహదపడింది. మ్యాచ్ ఓడిపోబోతున్నామని గ్రహించిన రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ మోరీస్, రాహుల్ తెవాటియా, కావాలని కేఎస్ భరత్ పై స్లెడ్జింగ్‌కి దిగారు.
అయినప్పటికీ మౌనంగా తన బ్యాటింగ్‌ని కొనసాగించిన కేఎస్ భరత్, క్రిస్ మోరీస్ హద్దులు దాటడంతో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఓ భారీ సిక్స్‌తో ధిటుగా జవాబిచ్చాడు. ఆఫ్ స్టంప్ లైన్ పై పడిన బాల్ ను మోకాలిని కిందకి వంచి బలంగా కోట్టాడు కేఎస్ భరత్ . సరిగ్గా అతను అనుకున్న విధంగా బాల్ కనెక్ట్ అవడంతో, 81 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం పైకప్పుని తాకింది. ఇంకేముంది కొత్త బాల్ కోసం బౌండరీ లైన్ వెలుపల ఉన్న ఫోర్త్ అంపైర్‌ని ఫీల్డ్ అంపైర్ కోరాడు.
ఈ క్రమంలో కేఎస్ భరత్ ఆ తరహాలో సిక్స్ బాదడంతో బిక్కమొహం వెసిన క్రిస్ మోరీస్, తన మాటల దాడిని మరింత పెంచేశాడు. దీంతో నాన్ స్ట్రైక్ ఎండ్ లోని గ్లెన్ మాక్స్‌వెల్ చొరవ తీసుకుని మోరీస్‌కి హెచ్చరించాడు. యువ క్రికెటర్ పై అలా నోరు పారేసుకొవ్దదని వార్నింగ్ ఇచ్చాడు. ఏదేమైనా ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక కేఎస్ భరత్ ఇన్నింగ్స్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ పొగడ్తలతో ముంచెత్తాడు.