గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న టీమిండియా యువ ఓపెనర్ “పృథ్వీ షా” ఎట్టలకే మునుపటి ఫామ్ ని అందుకున్నాడు. కేవలం ఒక్క భారీ ఇన్నింగ్స్ తో ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చేసాడు.
ఫామ్ లేమి, ఫిట్ నెస్ సమస్యలు, వివాదాలు, అంతకుమించిన విమర్శలు గత కొంతకాలంగా టీమిండియా యువ ఓపెనర్ “పృథ్వీ షా” పరిస్థితి ఇది. చాలా కాలంగా జట్టులో స్థానం కోల్పోయిన ఈ ముంబై ఓపెనర్.. ఆ తర్వాత ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లాంటి టోర్నీలో కూడా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఫ్యూచర్ స్టార్ గా కితాబులందుకున్న షా ఊహించని రీతిలో వెనకపడిపోయాడు. ఇక జాతీయ జట్టులో ప్లేస్ దక్కడం దాదాపు అసాధ్యం అనుకున్న దశలో ఎట్టలకే మునుపటి ఫామ్ ని అందుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్, కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ విమర్శకుల నోర్లు మూయించడమే కాదు ఏకంగా వరల్డ్ కప్ రేస్ లో నిలబెట్టింది. మరి షా అంతలా ఇంప్రెస్స్ చేసే ఇన్నింగ్స్ ఏం ఆడాడో ఇప్పుడు చూద్దాం.
“పృథ్వీ షా” కొన్ని సంవత్సరాల క్రితం ఈ పేరు ఒక సంచలనం. అండర్ 19, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొడుతూ అతి తక్కువ వయసులోనే టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. అంతేకాదు 18 సంవత్సరాల వయసులో తన తొలి టెస్టు సెంచరీ నమోదు చేసి ఫ్యూచర్ ఇండియన్ స్టార్ గా అందరి దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ కూడా సత్తా చాటుతూ తన ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసుకున్నాడు. సచిన్ లోని క్లాస్, సెహ్వాగ్ లో దూకుడు కలగలిపిన షా బ్యాటింగ్ చాలా సొగసరిగా ఉండేది. ఇంతవరకు బాగానే ఉన్నా .. సడన్ గా షా కెరీర్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. దీనికి కారణాలు పరిశీలిస్తే షా అతి విశ్వాసం, దురుసు ప్రవర్తనే కారణం అని తెలుస్తుంది.
అయితే షా ఇప్పుడు తనలో కొత్త యాంగిల్ ని చూపెడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో తూఫాన్ ఇన్నింగ్స్ తో సంచలనం సృష్టించాడు. సెంచరీ కాదు ఏకంగా డబుల్ సెంచరీతో దుమ్ము లేపాడు. ఈ టోర్నీలో నార్తాంప్టన్ షైర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. బుధవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లో 244 పరుగులు చేసి ఔరా అనిపించాడు. షా ఇన్నింగ్స్‌లో ఏకంగా 39 బౌండరీలు ఉండటం విశేషం. ఇక ఈ ఒక్క ఇన్నింగ్స్ తో షా వన్డే వరల్డ్ కప్ రేస్ లో తాను కూడా ఉన్నట్లుగా సంకేతాలిచ్చాడు. ప్రస్తుతం జట్టు కూర్పు విషయంలో టీమిండియా మల్ల గుల్లాలు పడుతుంది. అయ్యర్, రాహుల్, పంత్ లాంటి కీలక ప్లేయర్లు గాయం కారణంగా మిడిల్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది.
దీంతో ఇప్పుడు టీమిండియా యాజమాన్యానికి షా ఇన్నింగ్స్ కాస్త ఊరట కలిగిస్తుంది. అలవోకగా భారీ ఇన్నింగ్స్ లు అడగలిగే షా కెప్టెన్ రోహిత్ శర్మ తో ఓపెనింగ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే జరిగితే యువ ఓపెనర్ శుభమన్ గిల్ ప్లేస్ డేంజర్ జోన్ లో పడినట్లే. ఐపీఎల్ తర్వాత గిల్ కనీస స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ ల్లో విఫలమైన గిల్.. ప్రస్తుతం జరుగుతున్న విండీస్ పర్యటనలో కూడా తన పేలవ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో గిల్ ని నెంబర్ 4 లో ఆడించే అవకాశాలు కూడా లేకపోలేవు. మొత్తానికి ఒక్క భారీ ఇన్నింగ్స్ తో గిల్ స్థానానికే ఎసరు పెట్టాడు పృథ్వీ షా. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.