టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా తిలక్ వన్డే వరల్డ్ కప్ అవకాశాలు గురించి చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్ లోకి మరో యంగ్ క్రికెటర్ దూసుకొస్తున్నాడు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఒక తెలుగు కుర్రాడు తక్కువకాలంలోనే ఇలా జాతీయ జట్టులోకి దూసుకురావడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. గత రెండేళ్లుగా తిలక్ వర్మ ప్రస్తానం చూసుకుంటే ఎంతో పరిణితి చెందిన ఆటతీరు కనబరుస్తున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపీఎల్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ లో తన సత్తా చూపిస్తున్నాడు. ఇటీవలే విండీస్ పర్యటనలో టీ 20 ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఈ యంగ్ స్టర్ ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చాడు. ప్రస్తుతం తిలక్ వర్మ ఆట తీరు చూసిన వారెవరైనా ప్రశంసించకుండా ఉండలేరు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ తెలంగాణ కుర్రాడి మీద ప్రశంసల వర్షం కురిపించాడు.
మరో రెండు నెలలో స్వదేశంలో వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కీలక ప్లేయర్ల గాయాలు టీమిండియాని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ సమస్య జట్టుని బాగా వేధిస్తుంది. పంత్ దాదాపుగా వరల్డ్ కప్ రేస్ నుంచి నిష్క్రమించగా.. అయ్యర్, రాహుల్ గాయాల విషయంలో ఒక క్లారిటీ లేదు. ఇక కీలకమైన నాలుగో స్థానం కోసం మరోసారి యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తిలక్ వర్మ నాలుగో స్థానంలో అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్ నాలుగో స్థానానికి సరైనోడు అని అభిమానులతో పాటు ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా రోహిత్ తిలక్ వర్మ ఆటను కొనియాడాడు. అతనిలో ఎప్పుడూ పరుగులు చేయాలనే కసి ఉంటుందని చెప్పాడు. భారీ షాట్లు ఆడటంలో ఒక క్లారిటీతో ఉంటాడని.. ఎంతో పరిణితి చెందిన ఆటగాడని తిలక్ ని ఆకాశానికెత్తేసాడు.
ప్రస్తుతం విండీస్ సిరీస్ లో తిలక్ వర్మ ఆడిన తొలి మూడు టీ 20 మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి మ్యాచ్‌లో 39, రెండో మ్యాచ్‌లో 51 పరుగులతో టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన తిలక్.. మూడో మ్యాచ్‌లోనూ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో అరంగ్రేటం చేయకపోయినా ఈ తెలుగు కుర్రాడు పరిణితి చూస్తుంటే వన్డేల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. పైగా రోహిత్ రోహిత్ శర్మ సారధ్యంలో ముంబై ఇండియన్స్ కి తరపున ఆడడం తిలక్ వర్మకు కలిసి వచ్చే అంశం. పైగా కెప్టెన్ రోహిత్ శర్మ గత రెండేళ్లుగా తిలక్ ఆటను చాలా దగ్గరగా చూడటం, ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలతో తిలక్‌కు ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ తిలక్ వర్మ ఆసియా కప్ కి ఎంపికై అందులో రాణిస్తే.. వరల్డ్ కప్ టీమ్‌లో ఉండే అవకాశం దక్కడం పెద్ద కష్టం కాదని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. మరి రానున్న రెండు నెలల్లో తిలక్ భవితవ్యం ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.