తిరువనంతపురం- కరోనా సెంకడ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ కలవర పెడుతోంది. దేశంలో కరోనా కేసులు కనీస స్థాయిలో నమోదవుతున్న వేళ, 25 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆంక్షలను కఠినతరం చేసంది. ప్రధానంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టింది మోదీ సర్కార్.
ఇక కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా కనిపించిన కేరళ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతోంది. అక్కడ కరోనా కేసులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆంక్షలను సడలిస్తూ వస్తోంది కేరళ ప్రభుత్వం. ముఖ్యంగా శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శబరిమల యాత్రపై కరోనా ఆంక్షలను మరింత సడలిస్తూ, భక్తులు రాత్రిపూట బస చేసేందుకు అనుమతిస్తున్నట్లు కేరళ సీఎం విజయన్ తాజాగా ప్రకటించారు.
కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో శబరిమల యాత్రకు సంబంధించిన ఆంక్షలను మరింత సడలిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి విజయన్, దేవదాయశాఖ మంత్రి కే రాధాకృష్ణన్ లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం అయ్యప్ప భక్తులు ఇప్పుడు సన్నిధానంలో రాత్రిపూట బస చేయవచ్చు.
శబరిమలకు వచ్చే అయ్యప్పు భక్తులు బస చేసేందుకు 500 గదులు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పంబ నుంచి నీలిమల, అప్పాచిమేడు, మరకూటం వరకు రహదారిని కూడా తెరవాలని నిర్ణయించారు. యాత్రికుల కోసం నీలిమల, అప్పచిమేడులలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయ్యప్పు భక్తులు పంపా నదిలో స్నానం చేసేందుకు కూడా నిర్ణయించారు.