కూలి పని, చేతి వృత్తి ఏదైతే ఏముంది.. కష్టపడి పని చేసే వాళ్ళకి పెద్దగా సంపాదించుకునే అవకాశం ఉండదు. ఎంత కష్టపడినా నెలకు రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు మించి సంపాదించలేరు. కానీ ఒక వ్యక్తి మాత్రం కష్టపడుతూ ఏడాదికి రూ. 2 కోట్లు పైనే సంపాదిస్తున్నాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదూ. కష్టపడితే చెమట వస్తుంది కానీ కోట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే.
ఈరోజుల్లో డబ్బు సంపాదించాలంటే చదువు ఉండాలి. చదువు ఉంటేనే ఏదైనా టెక్నికల్ కోర్స్ నేర్చుకుని ఏ సాఫ్ట్ వేర్ ఇంజనీరో అయ్యి కోడింగ్ లతో యాప్స్, సాఫ్ట్ వేర్లు డెవలప్ చేస్తూ కోట్లు సంపాదించవచ్చు. లేదా వ్యాపారం అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా కేవలం చేతి వృత్తి ద్వారా ఏడాదికి రూ. 2 కోట్లు సంపాదిస్తున్నాడో వ్యక్తి. చేతి వృత్తి ద్వారా మహా అయితే రోజుకు రూ. 2 వేలు సంపాదించగలరు. గట్టిగా ప్రయత్నిస్తే రూ. 5 వేలు సంపాదిస్తారేమో. అది కూడా రోజూ అంటే కష్టమే. అదృష్టం బాగుండి సంపాదించినా కూడా నెలకు రూ. 1,50,000 అవుతుంది. ఏడాదికి రూ. 18 లక్షలు అవుతుంది. కానీ రూ. 2 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ప్లంబింగ్ పని చేస్తూ.
ఇతను అందరి ప్లంబర్లలానే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పని చేస్తారు. కాలం ఇతనికి, వేరే ప్లంబర్ కి ఒకేలా ఉన్నప్పుడు ఇతనికి ఎందుకంత ఆదాయం వస్తుంది. ఇతనిలో ఏముంది ప్రత్యేకత అంటే.. డ్యూటీ దిగిన తర్వాత కూడా సాయంత్రం, రాత్రి కూడా పని చేయడానికి వెళ్తారు. అత్యవసర కాల్స్ వస్తే కసురుకోకుండా వెంటనే వెళ్లి కస్టమర్ సమస్యని సాల్వ్ చేసి వస్తారు. అలా అతను ఉండే ఏరియాలో ఫేమస్ అయ్యారు. యూకేలోని కెన్సింగ్టన్ లో ఉండే 34 ఏళ్ల స్టీఫెన్ ఫ్రై ప్లంబర్ గా పని చేస్తున్నారు. 2,10,000 పౌండ్ స్టెర్లింగ్ సంపాదిస్తున్నారు. మన కరెన్సీ ప్రకారం రూ. 2 కోట్ల 15 లక్షలు పైనే. అంటే నెలకు దాదాపు రూ. 18 లక్షలు అన్న మాట.
బాయిలర్లు ఫిక్స్ చేయడం, టాయిలెట్లలో ప్లంబింగ్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ చేయడం, వాషింగ్ మెషీన్లు రిపేర్ చేయడం వంటివి చేస్తుంటారు. 17 ఏళ్ల వయసులో ప్లంబింగ్ అప్రెంటిస్ షిప్ చేశారు. పదేళ్ల క్రితం పింలికో ప్లంబర్స్ అనే లండన్ ఆధారిత కంపెనీలో చేరారు. చాలా తక్కువ సమయంలో కంపెనీలో అందరి కంటే ఎక్కువ సంపాదించే జీతగాడిగా ఎదిగారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పని చేస్తూ వారానికి 58 గంటల పని వేళలను మెయింటెయిన్ చేస్తున్నారు. రాత్రి ఏదైనా కంప్లైంట్ వస్తే వెంటనే వెళ్లి రిపేర్ చేస్తారు. తన పనిని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ చేస్తాడట.
బాత్రూం పైపుల్లోంచి నీరు లీక్ అవుతున్న, వేరే ఏదైనా సమస్యలు ఉన్నా మహిళలు కాల్ చేసి బాధపడతారని, ఆ సమయంలో తాను వెళ్లి పరిష్కరిస్తానని.. దీంతో స్త్రీలు ఉపశమనం పొందుతారని, అది ఎంతో సంతృప్తినిస్తుందని స్టీఫెన్ వెల్లడించారు. తన పనిని ఎప్పటికీ ఆపనని.. దీన్ని ఇలానే కొనసాగిస్తానని.. ఈ పని ఎంతగానో సంతృప్తినిస్తుందని అన్నారు. అంకితభావంతో కష్టపడి పని చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని, పని చేసే ఓపిక నశించేంత వరకూ ప్లంబర్ గానే పని చేస్తానని అన్నారు. కష్టపడి పని చేస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టీఫెన్ లండన్ లో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మాల్దీవులు, ఐలాండ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. మరి చేతి వృత్తితో కోట్లు సంపాదిస్తున్న ఈ బిలియనీర్ ప్లంబర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.