పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులు కాపీ కొట్టకుండా చూడటం కోసం ఉపాధ్యాయులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థుల మధ్య వీలైనంత ఎక్కువ దూరం ఉండేలా చూస్తారు. ఇక స్టూడెంట్స్ పరీక్ష హాల్లోకి వచ్చే ముందే వారిని పూర్తిగా చెక్ చేస్తారు. అయితే ఈమధ్య కాలంలో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. టెక్నాలజీని వాడుకుని.. కాపీ కొట్టడానికి కొత్త కొత్త పద్దతులు కనిపెడుతున్నారు. దీని సంగతి కాసేపు పక్కకు పెడితే.. విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించారు ఓ కాలేజీ యాజమాన్యం. అందులో భాగంగా విద్యార్థుల తలకు వస్త్రం, టోపీలు, మాస్క్‌లు, ఎగ్ కేస్ ఇలా రకరకాల వస్తువులతో తయారు చేసిన టోపీలను ధరించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఉండటం కోసం ఫిలిప్పీన్స్‌లోని బికోల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన మేరి జోయ్ మాండేస్ ఆర్టిజ్ అనే ప్రొఫెసర్ ఈ వినూత్న ఐడియాను తెర మీదకు తీసుకువచ్చాడు. దీనిలో భాగంగా.. ప్రొఫెసర్ పెట్టిన కండిషన్‌కి తగ్గట్టుగానే స్లూడెంట్స్ కూడా తమ క్రియేటివిటీని అంతా ఉపయోగించి ఇలా రకరకాల వస్తువులతో టోపీలు తయారు చేసుకుని.. ధరించి పరీక్షకు హాజరయ్యారు.
ఈ వింత టోపీలు ధరించడం వల్ల విద్యార్థులు ఎటూ తిరిగే వీలు లేకుండా.. పక్క వారి పేపర్ చూసే అవకాశం లేకపోవడంతో.. చాలా నిజాయితీగా పరీక్ష రాశారంట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన జనాలు ఎక్కడి నుంచి వస్తాయి రా సామీ.. మీకిలాంటి ఐడియాలు అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం.. కాపీ కొట్టడం వల్ల వచ్చే ఇబ్బంది గురించి చెప్పాలి కానీ.. ఇలా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరి కాదు అని కామెంట్స్ చేస్తున్నారు.