సాధారణంగా ఎస్టీడీ బూత్ కుర్రాళ్ళకి ఖర్చులు ఎక్కువ. కిల్లీ కొట్టు ఓనర్ ని వీళ్ళే పోషించాలి, సిగరెట్లు తయారుచేసే కంపెనీ వాడ్ని వీళ్ళే పోషించాలి, వాటిలో పని చేసే ఉద్యోగులనీ వీళ్ళే పోషించాలి. ఈ ధూమపానం బ్యాచ్ ని నమ్ముకుని పెద్ద వ్యవస్తే నడుస్తుంది. సిగరెట్ లు కొనుక్కుని తమ జీవితాన్ని తగలేసుకోకపోతే ఆ షాపు వాడికి, సిగరెట్ల కంపెనీ వాడికి, వాటిలో పని చేసే ఉద్యోగులకి వేరే గత్యంతరం లేదు. అందుకే వీళ్లందరినీ పోషించడానికి రోజూ సిగరెట్ తాగుతూ తమ జీవితాలని కాల్చుకుంటున్నారు మహానుభావులు. వీళ్ళు తాగితే తాగారు. మళ్ళీ అందులో పక్కనోడికి వాటా ఇస్తారు. ఓ పెద్దమనిషి ఏ రొట్టో కొనుక్కోవడానికి వెళ్తే, పక్కన ఒక సిగరెట్టోడు ఒకడుంటాడు. సిగరెట్ ని నోట్లో స్టైల్ గా పెట్టుకుని, ఉఫ్ఫ్ అంటూ కొంచెం పొగ లోపలకు తీసుకుని, మిగతా పొగని స్టైల్ గా బయటకి వదిలేస్తాడు.
అందులో రింగులని, బొంగులని ఏవో రకాలు ఉంటాయి. ఏ రకమైతే ఏముంది, పీల్చినవాడికి నరకమే గా. ఆ పొగ పెద్ద మనిషి ముక్కులోంచి నోట్లోకి, నోట్లోంచి కడుపులోకి పోతుంది. అరె అతని సిగరెట్ కి పెద్దమనిషి డబ్బులు పే చేయలేదురా, ఎందుకు అందులో వాటా ఇస్తున్నావంటే వినిపించుకోడే. అసలే పెద్దమనిషికి ఏదీ ఉచితంగా తీసుకునే అలవాటు లేదు. కలిసొచ్చేది అయినా సరే తీసుకోడు. అలాంటిది ఈ ఎస్టీడీ బూత్ అబ్బాయ్ పొగతో పాటు క్యాన్సర్ ని ఇస్తా అంటున్నాడు. పెద్దమనిషి ఎలా తీసుకుంటాడు చెప్పండి? ఆ కుర్రాడు పొగ బయటకు వదిలేది సెంటిమీటరే.. కానీ అది కిలోమీటర్ వరకూ ప్రయాణం చేస్తుంది. పైగా అది మామూలు పొగా.. పళ్ళు తోముకోకుండా పాచి నోటిలో పూజా హెడ్డే బాత్ చేసి వచ్చినటువంటి పొగ.
ఆ పొగ పీలిస్తే ఇంకేమైనా ఉందా? వీళ్ళు కాల్చుకుంటే పర్లేదు, పక్కనోళ్ళ జీవితాలను కూడా కాల్చేస్తున్నారు. పక్కనోడికి ఎందుకు ఆ పొగ పీల్చే భాగ్యం? పక్కనోడేమైనా ఆ సిగరెట్ కోసం పెట్టుబడి పెట్టాడా? లేదే. మరి దీంట్లో పార్టనర్ షిప్ ఎందుకో? వీడికొచ్చే క్యాన్సర్ లో పెట్టుబడి లేకుండానే పార్టనర్ షిప్ పక్కనోడికి ఇస్తాడు. సిగరెట్ కొనుక్కున్నది వీడు, తాగింది వీడు…అయితే గియితే క్యాన్సర్ వీడికి రావాలి గాని మనకెందుకు వస్తుంది అనుకుంటే చెప్పలేము. వచ్చేస్తుంది. ఇలా ఫ్రీగా పంచిపెట్టే వాళ్ళు ఉంటే క్యాన్సర్ ఏం కర్మ, ప్రతీ దానికీ సంబంధం లేని ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లుంటది పరిస్థితి. అసలు తాగినోడితో పాటు పక్కనోడికి కూడా క్యాన్సర్ రాకుండా సిగరెట్ ని నిషేధిస్తే బాగుంటుంది కదా. అలా నిషేధించిన దేశం కూడా ఉంది.
ప్రపంచంలోనే తొలి ధూమపాన రహిత దేశంగా రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది న్యూజిలాండ్. అవును న్యూజిలాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 నాటికి దేశాన్ని పూర్తిగా ధూమపాన రహిత దేశంగా మార్చాలని నిర్ణయించుకుంది. ధూమపాన నిషేధ చట్టానికి ఇవాళ న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్మోక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్స్ అండ్ రెగ్యులేటెడ్ ప్రాడెక్ట్స్ సవరణ బిల్లు రావాల్సి ఉండగా… ధూమపానం వల్ల న్యూజిలాండ్ ప్రజలు ఎంత నష్టపోతున్నారో గుర్తించిన మావోరీ అఫైర్స్ సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ స్మోక్ ఫ్రీ కంట్రీగా న్యూజిలాండ్ ను మార్చాలని 2010లో బిల్లుని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి బిల్లు ఆమోదం కోసం ఎదురుచూస్తుంది.
ధూమపానం వల్ల ప్రతిరోజూ 12 మంది మరణిస్తున్నారని మావోరీ అఫైర్స్ సెలెక్ట్ కమిటీ నివేదికలు వెల్లడించింది. ప్రజాస్వామ్యం మీద, శాసనసభల మీద ఈ పొగాకు కంపెనీల పెత్తనాన్ని ఆపాలని భావించింది. ప్రజల జీవితాలని చిన్నా భిన్నం చేసి లాభాలు పొందడమే వారి ఆసక్తి అని తెలిపింది. ది స్మోక్ ఫ్రీ యాక్షన్ ప్లాన్ పదేళ్ల క్రితమే చేయాల్సి ఉందని.. అలా చేయకపోవడం వల్ల 50 వేలకు పైగా మనవాళ్ళు పొగాకు కారణంగా చనిపోయారని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు 2025 నాటికి పూర్తిగా ధూమపానం నిషేధించాలని నిర్ణయించుకుంది. సిగరెట్లను విక్రయించే దుకాణాలను 6 వేల నుంచి 600కు తగ్గించి.. 2025 నాటికి పూర్తిగా దుకాణాలను నిషేధించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధూమపాన రహిత చట్టానికి ఇవాళ ఆమోద ముద్ర వేసింది. జనవరి 2023 నుంచి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో 2025 నాటికి న్యూజిలాండ్ దేశం ప్రపంచంలోనే తొలి ధూమపాన రహిత దేశంగా రికార్డు నెలకొల్పనుంది.
New Zealand will become the first country in the world to pass new laws aimed at creating a smokefree generation of young people. Less disease, fewer early deaths and more money in their pocket. When will the UK govt commit to a #Smokefree2030 https://t.co/YSiPIdIwVV
— Fresh – Making Smoking History (@FreshSmokeFree) December 13, 2022