ఆ యువకుడు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు. సొంత ఊరిలో ఉపాధి కరువై.. విదేశాలకు వెళ్లాడు. అక్కడ కార్లు క్లీన్ చేసే పనిలో కుదిరాడు. ఇక తండ్రి రిక్షా నడుపుతున్నాడు. ఈ కష్టాలు చాలవన్నట్లు.. సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్. వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రోజురోజుకు ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఈ కష్టాల కడలి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక.. ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఓ రోజు తన అదృష్టాన్నిపరీక్షించుకోవడం కోసం స్నేహితులతో కలిసి.. లాటరీ టికెట్ కొన్నాడు. అతడి కష్టాలు చూసి దేవుడికి దయ కలిగిందేమో.. అనూహ్యంగా వారు కొన్న టికెట్‌ని లాటరీ వరిచింది. ఏకంగా 21 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఇక తమ కష్టాలు తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు సదరు యువకుడు. ఈ సంఘటన వివరాలు..
నేపాల్‌కు చెందిన భరత్ అనే యువకుడు.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో.. దుబాయ్‌లో కారు క్లీనర్ పనికి కుదిరాడు. ఇక భరత్ తండ్రి.. ఢిల్లీలోనే రిక్షా నడుపుతూ ఉండేవాడు. ఇక భరత్ సోదరుడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. అతడికి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తండ్రి అక్కడే రిక్షా లాగుతూ.. కుమారుడి బాగోగులు చూసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఓ రోజు భరత్ తన స్నేహితుల సలహా మేరకు వారితో కలిసి ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే తాను గెలుస్తానని ఏమాత్రం అనుకోలేదు. ఏదో సరదాగా ఓ ప్రయత్నం అని భావించాడు. అయితే అతడి కష్టాలు చూసి దేవుడికి దయ కలిగిందో ఏమో.. భరత్ కొన్న లాటరీ టికెట్‌కే ప్రైజ్ మనీ వచ్చింది. ఈ వార్త తెలిసిన వెంటనే భరత్ నమ్మలేదు. కానీ తర్వాత సదరు మెహజూజ్ కంపెనీ వారు అతడికి కాల్ చేసి డబ్బులు తీసుకోవడానికి రావాల్సిందిగా చెప్పడంతో.. ఇక అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఇంత భారీ మొత్తం లాటరీ గెలుచుకున్న తొలి నేపాల్ వ్యక్తిగా నిలిచాడు భరత్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘లాటరీలో గెలిచిన డబ్బుతో నా కుటుంబం కష్టాలు తీరతాయి. నా వారందరిని ఆదుకుంటాను. మరో నాలుగు రోజుల్లో మా దేశానికి వెళ్తాను. ఇంటి దగ్గర అన్ని చక్కబడ్డాక మళ్లీ వచ్చి డ్రాలో పాల్గొంటాను’’ అని తెలిపాడు. భరత్‌ని వరించిన అదృష్టాన్ని చూసి.. అతడికి అభినందనలు తెలుపుతున్నారు జనాలు. ఇక కొన్ని రోజుల క్రితం కేరళ లాటరీలో అనూప్ అనే వ్యక్తి 500 రూపాయలు పెట్టి లాటరీ కొని.. ఏకంగా 25 కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నేపాల్ యువకుడి వంతు. మరి భరత్‌ని వరించిన అదృష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.