అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రే బిచ్చగాడు కోటీశ్వరుడు కాగలడు.. బిలయనీర్ దివాలా తీయవచ్చు. ఇదిగో ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి.. కుటుంబ పోషణ నిమిత్తం విదేశాలకు వెళ్లే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి సరదాగా లాటరీ టికెట్ కొన్నాడు. అయితే 24 గంటలు గడిచిలోగా అతడి సుడి తిరిగింది. 500 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా 25 కోట్లు తగిలాయి. దాంతో అతడి ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఓనం బంపర్ లాటరీలో ఏకంగా 25 కోట్ల రూపాయలు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు సదరు ఆటో డ్రైవర్. ఆ వివరాలు..
కేరళ, శ్రీవరాహం ప్రాంతానికి చెందిన అనూపప్.. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆదాయం సరిపోకపోవడంతో.. విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే అతడికి మలేషియాలో షెఫ్‌గా ఉద్యోగం లభించింది. ఈ క్రమంలో అక్కడకు వెళ్లడం కోసం బ్యాంక్ రుణం కూడా మంజూరు అయ్యింది. మరి కొన్ని రోజుల్లో మలేషియా వెళ్లాల్సి ఉండగా.. అనూహ్యంగా లాటరీలో 25 కోట్ల రూపాయలు గెలుచుకుని కోటీశ్వరుడయ్యాడు.
ఈ క్రమంలో శనివారం అనూప్ లాటరీ టికెట్ కొన్నాడు. అయితే.. దాన్ని ఇచ్చేసి మరో టికెట్ తీసుకుని ఇంటికి వచ్చాడు. రెండో సారి తీసుకున్న టికెట్‌కి లాటరీ తగిలింది. 500 రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్ 25 కోట్లు ఇచ్చింది. పన్నులు చెల్లించిన తర్వాత 15 కోట్ల రూపాయలు అనూప్ చేతికి రానున్నాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఏదో సరదాకు టికెట్ తీసుకున్నాను. కానీ దానికే లాటరీ తగులుతుందని ఊహించలేదు. మలేషియా వెళ్లను.. బ్యాంక్ లోన్ కూడా చెల్లిస్తాను. అప్పులు తీర్చి.. మంచి ఇల్లు కట్టుకుంటాను. ఇక్కడే ఏదైనా వ్యాపారం చేసుకుంటాను’’ అని తెలిపాడు. మరి అనూప్ అదృష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.