ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగి కొన్ని దేశాల భూభాగాలు కనుమరుగవుతున్నాయి. దీంతో ఓ ద్వీప దేశం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..!
ఏటేటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆ దేశం, ఈ దేశం అనే తేడాల్లేకుండా దాదాపుగా అంతటా ఇదే పరిస్థితి. పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు అత్యవసరంగా మారిపోయింది. భూమిని కాపాడుకోవాలన్నా, వచ్చే తరాలకు మంచి భవిష్యత్తును, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్నా పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి. కానీ ఇందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఏటా ప్రపంచ దేశాలు తీర్మానాలు చేస్తున్నాయి. కానీ, అవేవీ ఫలించడం లేదు. నీటి మీద రాతలుగానే ఉండిపోతున్నాయి. దీంతో కర్బన ఉద్గారాల కారణంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో వరల్డ్‌వైడ్‌గా కొన్ని ద్వీప దేశాల భూభాగాలు సముద్రంలో కలిసిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ద్వీప దేశం తువాలు కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తమ దేశాన్ని డిజిటల్ కంట్రీగా మారుస్తామని ప్రకటించింది తువాలు ఐలాండ్. ఆస్ట్రేలియా, హవాయిల మధ్య ఉన్న తువాలు ఐలాండ్ మొత్తంగా తొమ్మిది దీవుల సమూహం. ఇక్కడ 12 వేల మంది నివాసం ఉంటున్నారు. ఇప్పటికే పైన పేర్కొన్న కారణాల వల్ల తువాలు రాజధాని ప్రాంతం 40 శాతం వరకు సముద్రంలో కలిసిపోయింది. ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం ఆఖరుకు తువాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. వరల్డ్‌లో గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తువాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు మెటావర్స్‌లో తమ దేశాన్ని తయారు చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైమన్ కోఫే తెలిపారు. త్వరలోనే తువాలు తొలి వర్చువల్ కంట్రీగా ప్రపంచ ప్రజల ముందు దర్శనమివ్వబోతోందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఒకవేళ తువాలు ఐలాండ్ కనుమరుగైనా.. మెటావర్స్ ద్వారా అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవన విధానాన్ని టూరిస్టులు చూడొచ్చన్నారు. తువాలును డిజిటల్ కంట్రీగా మార్చేందుకు ది మంకీస్, కొల్లైడర్ అనే కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. ఇందులో తువాలు హిస్టరీకి సంబంధించిన డాక్యుమెంట్లు, కుటుంబ ఫొటోలు, సంప్రదాయ పాటలు లాంటి వాటిని నిక్షిప్తం చేయనున్నారు. మరి.. త్వరలో మెటావర్స్‌లోకి రానున్న తువాలు ఐలాండ్‌ను చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.