2019లో ఓ గే జంట సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. న్యూజెర్సీలో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ బధంతో ఒకటయ్యారు. ఇప్పుడు అదే జంట మరోసారి వార్తల్లో నిలిచారు. అమిత్ షా- ఆదిత్య దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ప్రకటించారు. వచ్చే మేలో తమకు తొలి బిడ్డ జన్మించబోతోందంటూ తెలిపారు. అందుకు సంబంధిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి వాళ్ల కథేంటో తెలుసుకుందాం..
అమిత్ షా- ఆదిత్య సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. బేబీకి సంబంధించిన స్కాన్ కాపీ ఇమేజ్ ని నెటిజన్స్ తో పంచుకున్నారు. అయితే ఇద్దరూ మగాళ్లే అయినప్పుడు బిడ్డ ఎలా పుడుతుందని మీకు ఇప్పటికే అనుమానాలు మొదలై ఉంటాయి. అయితే వీళ్లు సరోగ్రసీ, కృత్రిమ గర్భధారణ వంటి వాటిపై చాలానే అధ్యయనాలు చేశారు. అండం దానం చేసే వారి కోసం కూడా చాలానే ప్రయత్నాలు చేశారు.
ఎట్టకేలకు ఓ డోనర్ దొరకడంతో వారి కలను నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఐవీఎఫ్ ద్వారా నాలుగో ప్రయత్నంలో వారి కల సాకారమైంది. ఈ విషయం తెలియజేస్తూ వాళ్లు ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎప్పటిలాగానే స్వలింగ సంపర్క జంటల గురించి మాట్లాడము. మేము ఇక నుంచి కేవలం జంటల గురించి మాత్రమే మాట్లాడతామంటూ అమిత్ చెప్పుకొచ్చాడు. ఆదిత్య మాట్లాడుతూ.. “మేము స్వలింగ సంపర్క తల్లిదండ్రులుగా ఉండము. మేం కేవలం తల్లిదండ్రులుగా మాత్రమే ఉంటాం” అంటూ ఆదిత్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరి పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
ఇంటర్నెట్ లో మేము చూసిన బెస్ట్ థింగ్ ఇదని కొందరు.. మీ నుంచి ఈ శుభవార్త కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం అంటూ మరికొందరు కామెంట్ చేశారు. చాలామంది స్వలింగ సంపర్కులు మీరు ఎంతోమందికి ఆదర్శం అంటూ ఆనందం వ్యక్తంచేశారు. మీ పోస్ట్ చూశాక మేము ఎంతో ఎమోషనల్ అయ్యామంటూ తెలియజేస్తున్నారు. మీరు మంచి తల్లిదండ్రులు కావాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చాలామంది వారి పోస్టుకు కామెంట్ చేస్తున్నారు.
వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. అమిత్ న్యూజెర్సీకి చెందిన గుజరాతీ అమెరికన్. ఆదిత్య మాదిరాజు ఢిల్లీకి చెందిన తెలుగబ్బాయి. వీళ్లు 2016లో ఓ ఫ్రెండ్ పెళ్లిలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వాళ్లు 2019 వరకు ప్రేమికులుగానే ఉన్నారు. తర్వాత వారి జీవితంలో తర్వాత స్టెప్ వేయాలని భావించారు. తల్లిదండ్రులను ఒప్పించి 2019లో న్యూజెర్సీలో హిందూ సంప్రదాయంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీళ్ల వివాహం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.