ప్రకృతి కన్నెర్ర చేయడంతో క్యూబా దేశం వణికిపోయింది. క్యూబాలో ఇయన్ తుఫాన్ భీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావానికి వేలాది చెట్లు నేల మట్టమయ్యాయి. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పలువురి ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంటి పై కప్పులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పినార్ డెల్ రియో ప్రాంతంలో ఇయన్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై ఎక్కడికక్కడ వేలాది చెట్లు అడ్డంగా పడిపోవడం, రహదారులపైకి, ఇళ్లపైకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పినార్ డెల్ రియో ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. కోటి 10 లక్షల ఇళ్ళకి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రంతా అంధకారంలో గడపాల్సి వచ్చింది. క్యూబా ఆర్ధిక వ్యవస్థకు ఆధారం అయినటువంటి పొగాకు పంటలు ఇయన్ తుఫాన్ కారణంగా పూర్తిగా దెబ్బ తిన్నాయి. తమ పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. క్యూబాకి ఇంతటి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన ఇయన్ తుఫాన్.. అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపుకి దూసుకెళ్తుంది. దీంతో అమెరికా అలర్ట్ అయ్యింది. గంటకి 209 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని అమెరికా తుఫాను కేంద్రం హెచ్చరించింది.