హనీమూన్ కోసం వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో తీపి అనుభూతులను పంచుకునేందుకు వెళ్లిన విహార యాత్రను పీడకలగా మార్చింది ఓ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ. స్నోర్కెలింగ్ కు వెళ్లిన జంటను నడి సంద్రంలో వదిలేసి వచ్చింది. దీంతో ఆ జంట న్యాయ పోరాటానికి దిగింది.
కొత్తగా పెళ్లైన తర్వాత ఏకాంతం కోసం వధూవరులు హనీమూన్‌కు వెళతారు. దీన్ని జీవితాంతం గుర్తుండిపోయే మధుర స్మృతులుగా నింపుకోవాలని ఆశిస్తుంటారు. దీని కోసం బెస్ట్ వ్యూ, పచ్చని, చల్లని ప్రదేశాలు, తీర ప్రాంతాలను ఎంచుకుంటారు. పెళ్లి అవ్వడం ఆలస్యం అక్కడ వాలిపోతారు నూతన జంట. కానీ ఓ జంటకు మాత్రం హనీమూన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. తీపి గుర్తులుగా మార్చుకోవాలన్న ఈ విహార యాత్రను .. ఓ ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాకంతో చేదు జ్ఞాపకంగా మారింది. హనీమూన్ కోసం సముద్ర దీవులకు వెళ్లిన ఆ జంటను ట్రావెల్ ఏజెన్సీ నడి సంద్రంలో వదిలేసింది. అనంతరం బ్రతుకు జీవుడా అంటూ బయటపడింది ఆ జంట.
కాలిఫోర్నియాకు చెందిన ఎలిజబెత్ వెబ్‌స్టెర్, అలెగ్జాండర్ బర్కిల్‌లు హనీమూన్‌లో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. 2021లో సెప్టెంబర్‌లో వివాహమైన ఈ జంట..హనీమూన్ కోసం హవాయి దీవుల్లోని లనాయ్ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ‘సెయిల్ మౌయీ’అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. ఆ నెల 23న అక్కడకు వెళ్లిన నూతన దంపతులు.. డైవింగ్ మాస్కులు, స్విమ్ సూట్ ధరించి సముద్ర గర్భంలో ‘స్నొర్కెలింగ్’కు బయలుదేరారు. పడవలో దాదాపు 44 మంది పర్యాటకులను తీసుకెళ్లి ఓ చోట నిలిపారు. ఈతకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిన దాని కెప్టెన్.. ఎంత సేపట్లో తిరిగి రావాలి, పడవలోకి ఎలా చేరాలి అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేదు. అయితే సముద్రంలోకి దిగిన జంట ఓ గంట సేపు నీటిలో గడపగా.. తర్వాత పరిస్థితులు అల్లకల్లోలంగా మారినట్లు గ్రహించారు. తమ నౌక వైపు ఈత కొట్టేందుకు ప్రయత్నించగా.. అది దూరంగా వెళ్లడాన్ని గమనించారు.
దీంతో వారు భయాందోళనలు చెందారు. చేసేదేమీ లేక ఈత కొట్టుకుంటూ ఒడ్డు వరకు వచ్చారు. మధ్యలో అలసిపోయిన, సత్తువ కోల్పోయిన తమకు దీవుల్లో నివసించే ఓ వ్యక్తి సహాయం చేసినట్లు తెలిపారు. ఒడ్డుకు చేరుకున్నాక అక్కడి స్థానికులు నీరు అందించి, ఫోన్స్ చేసుకునేందుకు అవకాశం కల్పించారట. వారు ఫోన్ చేసినప్పుడు మాత్రమే సదరు సంస్థ ఇద్దరు వ్యక్తులను విడిచిపెట్టామన్న విషయం గుర్తుకు వచ్చిందట. తమ హనీమూన్‌ను పీడకలగా మార్చిన సదరు ట్రావెల్ సంస్థపై నూతన జంట న్యాయ పోరాటానికి దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న స్థానిక కోర్టులో దంపతులు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.40కోట్లు) చెల్లించాలని డిమాండు చేస్తూ దావా వేశారు. ఏజెన్సీ నిర్వహణ లోపం వల్లే ఆ ఘటన జరిగిందని.. తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని ఆరోపించారు.