ఉద్యోగులు సెలవులు పెట్టడం ఏ సంస్థలోనైనా కామనే. వ్యక్తిగత ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పెళ్లిళ్లు, టూర్లు.. ఇలా అవసరాన్ని బట్టి లీవ్స్ తీసుకోవడం సర్వసాధారణమే. కానీ యూఎస్, యూకేల్లో ఎంప్లాయీస్ లీవ్స్ తీసుకునేందుకు చెబుతున్న కారణాలు వింటే ఒకింత ఆశ్చర్యానికి గురవ్వక తప్పదు.
భూమికి ఆవల ఇతర గ్రహాల్లో జీవం ఉందనే దానిపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. మనిషి లాంటి లేదా మనిషిని మించిన ఇతర జీవం జాడ అక్కడ ఉందేమోనని తెలుసుకునే పనిలో ఎన్నో దేశాల సైంటిస్టులు బిజీగా ఉన్నారు. ఏలియన్స్ గురించి కూడా ఎన్నో స్టోరీలు వినుంటారు. గ్రహాంతరజీవులపై వచ్చిన ‘కోయీ మిల్ గయా’, ‘ఎంఐబీ’, ‘ప్రిడేటర్’ లాంటి సినిమాలు కూడా చూసుంటారు. ఏలియన్స్ ఉన్నాయా లేవా అనే దానిపై సినిమాలు వచ్చాయి. వాటిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఇది మరీ ఎక్కువ. గ్రహాంతరజీవులు అంటే యూఎస్ వారికి ఉన్న పిచ్చి ఇప్పుడు పీక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది.
ఏలియన్స్ పేరు చెప్పుకుని సెలవులు తీసుకోవడం అమెరికాలో ఇప్పుడు షరా మామూలుగా మారింది. కొన్ని కంపెనీలు ఇలాంటి లీవ్‌లు కూడా ఇస్తుండటం మరో విచిత్రంగా చెప్పుకోవాలి. నమ్మడానికి కాస్త వెరైటీగా ఉన్న ఇది నిజం. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు.. ఆఫీసుకు రాకుండా ఎగ్గొట్టి, ఎందుకు రాలేదంటే ఇలాంటి సాకులే చెబుతూ తప్పించుకుంటున్నారు. ఈమధ్య అక్కడ ఓ కంపెనీ ఉద్యోగి కార్యాలయానికి రాలేదు. ఎందుకు రాలేదని బాస్ ఫోన్ చేస్తే.. ‘సారీ సార్. నా పరిస్థితి ఏం బాగోలేదు. నన్ను గ్రీన్ కలర్ వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నాకు ఏమైందో అర్థం కావడం లేదు. రికవరీ అయ్యేందుకు కొంత టైమ్ పడుతుంది’ అని చెప్పడంతో బాస్‌కు ఒక్కసారిగా దిమ్మ తిరిగింది.
యూఎస్‌లో ఈమధ్య చాలా కంపెనీల్లో ఎంప్లాయీస్ ఇలాంటి కారణాలే చెప్పి సెలవులు తీసుకుంటున్నట్లు హెచ్ఆర్ బాసులు అంటున్నారు. అమెరికాతో పాటు యూకేలోనూ గత ఏడాది కాలం నుంచి ఇది చాలా ఎక్కువైందని చెబుతున్నారు. ఈ దేశాల్లో కొంతమంది ఉద్యోగులు అయితే.. తమను ఏలియన్స్ ఏకంగా ఇతర గ్రహాల పైకి తీసుకెళ్లాయని అంటున్నారట. మరికొంతమంది ఉద్యోగులు.. తాము ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నామని అంటున్నారట. ఎందుకని ప్రశ్నిస్తే.. తమ ఇంటి దగ్గర దెయ్యాలు భయపెడుతున్నాయని, బయటకు వస్తే ప్రాణాలకు ప్రమాదమని చెబుతున్నారట. ఆఫీసులకు రమ్మంటే పొరపాటున వారికి ఏమైనా అయితే అది తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని హెచ్ఆర్ వాళ్లు రమ్మనకుండా ఉంటున్నారట.
ఎక్స్పర్ట్స్ బ్రైట్ హెచ్ఆర్ వాళ్లు తమ ఎంప్లాయీస్ కోసం సిక్నెస్ ట్రాకింగ్ టూల్ తెచ్చారని తెలుస్తోంది. దీని ప్రకారం.. ఎక్కువ మంది ఏలియన్స్, దెయ్యాల భయంతో లీవ్ తీసుకుంటున్నట్లు తేలింది. ఈ సంస్థ ఈ కారణాలతో లీవ్ పెట్టేవారికి అనుమతి కూడా ఇస్తుండటం గమనార్హం. ఇకపోతే, ఏలియన్స్ పేరుతో సెలవులు తీసుకోవడం ఈ నెలలో మరింత ఎక్కువైందట. అమెరికా ఆకాశంలో వింత బెలూన్లు ఎగురుతుంటే.. వాటిని ఏలియన్స్‌తో ముడిపెట్టి ఆఫీసులకు ఉద్యోగులు డుమ్మా కొడుతున్నారట. మరి.. ఉన్నాయో లేవో తెలియని గ్రహాంతరవాసులను సాకుగా చూపి ఉద్యోగులు సెలవులు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.