కరోనా.. మానవ జాతిని ఇప్పట్లో ఈ రక్కసి వదిలేలా లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ సరికొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ ప్రజలని ఆందోళనకి గురి చేస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట స్థితిలో బ్రిటన్ డాక్టర్స్ ప్రపంచ దేశాలకి గుడ్ న్యూస్ చెప్పారు!
కొవిడ్-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్‌లోని వైద్య నియంత్రణ సంస్థ ‘ద మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ’ (ఎంహెచ్‌ఆర్‌ఏ) ఆమోదించింది. ఇది ఒక్క ఒమిక్రాన్ మీద మాత్రమే కాదు, భవిష్యత్ లో రానున్న కొత్త వేరియంట్లపైనా కూడా బాగా పని చేస్తుందని వైద్యులు చెప్తున్నారు.
సోత్రోవిమాబ్ అనే ఈ ఔషధాన్ని సింగిల్ మోనోక్లోనల్ యాంటీబాడీలతో తయారుచేశారు. ఇది కరోనా వైరస్‌పైన ఉండే కొమ్ము ప్రొటీన్‌కు అంటుకుంటుంది. అంటే.. శరీరంలో కరోనా వైరస్ కదలికని సోత్రోవిమాబ్ అడ్డుకుంటుంది. దీని కారణంగా వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిలువరిస్తుంది.పైగా.. ఈ ఔషధం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఎంహెచ్‌ఆర్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనే తెలిపారు.
సోత్రోవిమాబ్‌ను ఇంజెక్షన్ వేసినట్టు క్షణాల్లో బాడీలోకి ఎక్కించలేరు. దీనిని రక్తనాళాల ద్వారా 30 నిమిషాల పాటు ఇస్తారు. ఈ విధానంలో చికిత్స తీసుకోవాలంటే 12 సంవత్సరాల వయసు పైబడి ఉండాలి. ఇక కోవిడ్ తీవ్రత అధికంగా ఉండేవారిని కూడా సోత్రోవిమాబ్ కాపాడగలదని వైద్యులు తెలియజేస్తున్నారు.కరోనాకి గురైన వారు ఎలాంటి స్థితిలో ఉన్నా, మరణం బారినపడకుండా 79 శాతం మేర ఈ ఔషధం రక్షిస్తుందని పరిశోధకులు తేల్చి చెప్తున్నారు. మరి.. ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్స్ కి మంచి ఔషధం రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.