ఇటీవల కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు తమను ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురైతున్న విషయం తెలిసిందే. ఇది చిన్న పిల్లలో కూడా ఉంటుందని పలు సంఘటనలు రుజువు చేశాయి. ఇటీవల కాలంలో చిన్న పిల్లలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ తల్లిదండ్రులపై ఫిర్యాదులు ఇస్తున్నారు. స్టేషన్ లో పెద్దస్థాయి అధికారుల ముందు ఏమాత్రం బెరుకు లేకుండా ఫిర్యాదులు చేయడం నవ్వులు పూయిస్తుంది.. కొన్నిసార్లు ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ పదేళ్ల కుర్రాడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు తన తల్లిపై చేసిన ఫిర్యాదు ఏంటో తెలిస్తే పగలబడి నవ్వుతారు. వివరాల్లోకి వెళితే..
ఓ బాలుడు తన తల్లిపై కోపం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తల్లిపై ఫిర్యాదు చేశాడు. తన తల్లి కొన్నిరోజులు నుంచి బాగా టార్చర్ పెడుతుందని ఎలాగైనా ఆమెను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని చాంక్ కింగ్ లోని పోలీస్ స్టేషన్ కి ఓ పదేళ్ల కుర్రాడు వచ్చి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. ‘ మా అమ్మ కొన్నిరోజులుగా బాగా సతాయిస్తుందని.. ఆమె టార్చర్ భరించలేకపోతున్నా అని.. ఆమెపై కేసు పెట్టి అరెస్ట్ చేయండి. అలాగే ఇక నుంచి నేను మా ఇంటికి వెళ్లను, నన్ను ఓ అనాథాశ్రమంలో చేర్పించండి’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలుడు చెప్పిన విషయం అంతా ఓపికగా విన్న పోలీసులు అతని తల్లితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. మాటల్లో పెట్టి బాలుడిని ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు. వాళ్లకు ఫోన్ చేసి స్టేషన్ కి రప్పించారు. బాలుడు చేసిన ఫిర్యాదు గురించి తల్లిదండ్రులకు చెప్పారు. అయితే హూం వర్క్ చేయమని మందలించిన మాట నిజమే అని అంగీకరించింది బాలుడి తల్లి. పోలీసులు బాలుడికి అతని తల్లిదండ్రులకు సర్ధిచెప్పి ఇంటికి పంపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.