ఇప్పుడంటే పక్కా ఇళ్లు వచ్చేశాయి కానీ.. ఒకప్పుడు పూరీ గుడిసెలే. అవే నివాసాలు, బడులు కూడా అవే రూపంలో ఉండేవి. ఎండాకాలం సూటిగా సూరీడు, వర్షాకాలంలో వాన నీళ్లు .. పూరి గుడిసెలకు పడిన రంధ్రాల్లో నుండి వచ్చేవి. బడుల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోందీ తూర్పు ఆఫ్రికాలోని ఓ గ్రామీణ ప్రాంతం. కానీ ఆ సమస్యలకు చెక్ పెట్టిందీ ఓ ఇండియన్ జంట.
తూర్పు ఆఫ్రికాలో వెనుకబడిన ప్రాంతం మలావి. అక్కడ ఫిబ్రవరిలో కూడా వర్షాలు పడుతున్నాయి. తలపై పుస్తకాలతో పిల్లలు రోడ్లపై పరుగులు పెడుతున్నారు. వర్షం పడినప్పుడల్లా తలను కవర్ చేసుకునేందుకు చెట్టు, పుట్టను ఆశ్రయిస్తున్నారు. అయితే అటుగా వెళుతున్న ఓ వ్యక్తి కొన్ని రోజులుగా ఇవన్నీ గమనించాడు. వర్షం పడుతున్న సమయంలో పిల్లలు స్కూల్లో ఉండొచ్చు కదా.. ఇక్కడ రోడ్లపై చెట్ల కింద తలదాచుకోవడం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తింది. ఈ విషయాన్ని తన డ్రైవర్ తో పంచుకున్నాడు సదరు వ్యక్తి. అయితే అసలు విషయం తెలిసి చలించిపోయాడు. వారు చదువుకునే పాఠశాలకు సరైన భవనం తేదని తెలిసి తల్లడిల్లిపోయి ఓ నిర్ణయం తీసుకున్నాడు.
ఆ పిల్లల కోసం ఓ భవనాన్ని కట్టించాడు. ఆ నిర్ణయమే పిల్లలు బడుల్లో హాయిగా చదువులు సాగించేందుకు సాయపడింది. ఇంతకు ఎవరు అతను అనుకుంటున్నారా. కేరళకు చెందిన అరుణ్ అశోకన్. మల్లప్పురానికి చెందిన అరుణ్ ఓ నిర్మాణ సంస్థ ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం తూర్పు ఆఫ్రికాలోని మలావికి వచ్చాడు. రెండేళ్ల క్రితం ఓ డ్యామ్ నిర్మాణ పనుల నిమిత్తం చిసాసలా అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడే తాటాకులతో కట్టిన ఓ పూరి గుడిసెలో సాగుతున్న ప్రాథమిక బడిని చూసి అతడి మనసు చలించిపోయాడు. కేరళలోని అతడి స్కూల్ గుర్తుకువచ్చి.. ఇక్కడ కూడా ఓ స్కూల్ నిర్మించాలనే ఆలోచన పుట్టింది. ఈ పాఠశాలకు గుర్తింపు కూడా లేకపోవడం, గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక బడికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న చిన్నారుల కష్టం చూడలేకే పాఠశాల కట్టించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు అరుణ్ చెబుతున్నాడు.
ముందుగా వీరి కోసం ప్లాస్టిక్ షీట్ తో ఓ షెడ్ నిర్మించుకోవాలని భావించారట. అయితే ఎంత కాలం ఉండదని భావించిన అతడూ ఓ పాఠశాల కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పాడు. అందుకు వారు కూడా అంగీకరించారు. అయితే ఇక్కడ డబ్బుతో కూడుకున్న సమస్య కాబట్టి.. ఈ విషయాన్ని దుబాయ్ లో ఉంటున్న ఆషిక్ అనే స్నేహితుడికి చెబితే.. ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అతడి కలను నెరవేర్చేందుకు భార్య సమీ కూడా తోడైంది. పాఠశాల నిర్మాణం ప్రారంభ పనులు చేపట్టారు. దీని కోసం ఆ గ్రామస్తులు, తాము స్వయంగా ఇటుకలు తయారు చేసినట్లు అరుణ్ తెలిపారు. అయితే అక్కడే సమస్య మొదలైందన్నారు. ఆదివారం మాత్రమే ఇటుకల తయారీతో పాటు తనకు కంపెనీ అప్పగించిన బాధ్యతలు ఉండటంతో పాఠశాల నిర్మాణంలో ఆలస్యం చోటుచేసుకుందని అన్నారు. చివరకు గ్రామస్థుల్లో కూడా స్థైర్యం సన్నగిల్లిందని, దీనికి కరోనా తోడైందన్నారు.
‘ఈ సమయంలో పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో కూలీలను పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీరు కూడా అందకపోతే.. రెండు కిలోమీటర్ల దూరం నుండి తీసుకువచ్చాం. ఒక్కొక్క సారి అతడి భార్య సుమీ తలపై నీటిని మోసుకు వచ్చేది. కూలీలు దినసరి కూలీలు కావడంతో సమయం వృథా కాకుండా నీటిని సేకరించడం, పని ముట్లను ఏర్పాటు చేసేవాళ్లం’అని ఈ స్కూల్ నిర్మాణం కోసం వారు పడ్డ పాట్లు గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో వారికి ఆర్ధిక సహాయం చేసేందుకు ఎన్నో నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. అంతేకాకుండా భార్య సుమీ ‘మలావి డైరీస్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ పెట్టి వాటి నుండి వచ్చే ఆదాయాన్ని కూడా దీని కోసమే వినియోగించారు.ఈ స్కూల్ నిర్మాణానికి అరుణ్ సంస్థ కూడా తోడ్పాటునందించింది. అలా 18నెలల్లో పాఠశాల నిర్మాణం పూర్తి చేశారు
ఈ స్కూల్ కు కేరళ బ్లాక్స్ అని నామకరణం చేశారు. ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాదు, ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు కూడా లభించడంతో చిన్నారులు ప్రతీ ఏటా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి మాత్రమే పరీక్షలు రాయాల్సి న అవసరం తప్పింది. ప్రభుత్వం ఇద్దరు ఉపాధ్యాయులను కూడా నియమించింది. ఈ పాఠశాలను 8వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం స్కూల్ నిర్మాణం మాత్రమే కాదు, స్థానిక ప్రజల్లో అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్న ఈ మళయాళీ దంపతులు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే స్కూల్ నిర్మాణంతో వీరి సంకల్పాన్ని నిలిపివేయలేదు. ప్రహరీతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలాన్ని తీర్చిదిద్దేందుకు పూనుకున్నారు. పిల్లలకు యూనిఫామ్ లు, లైబ్రరీ, ఇతర సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నట్లు చెబుతోంది ఈ జంట. పాఠశాల కట్టించిన ఈ జంట కృషి ప్రశంసనీయం. వీరి కృషి పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.