యాదాద్రి- తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. యాదాద్రి ఆలయ పున: ప్రారంభ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 28 మార్చి 2022న యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణతో ఆలయ పున:ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
మహా సంప్రోక్షణకు 8 రోజుల ముందు నుంచీ సుదర్శన యాగం నిర్వహిస్తామని తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం పది వేల మంది రుత్విక్కులతో యాగం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన తరువాత, సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో కీలక విషయాలు తెలిపారు. తెలంగాణలోని మహోత్కష్టమైన దేవాలయాల్లో యాదాద్రి ప్రముఖమైనదని ఆయన అన్నారు.
యాదాద్రి అభివృద్ధికి నాలుగేళ్ల కిందట బీజం వేశామని ఈ సంర్బంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ తరహాలో యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకోసం మొత్తం 125 కిలోల బంగారం అవసరమవుతుందని ఆయన చెప్పారు. బంగారు తాపడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ విరాళం ప్రకటించారు. ఒక కిలో 16 తులాల బంగారం విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే విరాళాలు ఆహ్వానిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ పుణ్య కార్యక్రమంలో పాలుపంచుకుంటామని పలువురు ప్రముఖులు ముందుకొచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చినజీయర్ స్వామి పీఠం నుంచి కిలో బంగారం, కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి కుటుంబం తరఫున ఒక కిలో బంగారం, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి రెండు కిలోల బంగారం, కావేరి భాస్కర్ రావు కిలో బంగారం అందజేసేందుకు ముందుకొచ్చారని ఆయన చెప్పారు.
ఇక హెటిరో ఫార్మ చైర్మెన్ పార్ధసారధి రెడ్డి 5 కిలోల బంగారం విరాళంగా ప్రకటించారు. ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్ ఒక్కో కిలో బంగారం చొప్పున విరాళం ప్రకటించారు.