మీకు అందరికీ గుర్తుందా? 2021 లోకి ఎన్ని ఆశలతో అడుగు పెట్టామో? 2020లో కరోనా అనే మహమ్మారి మన మీద విరుచుకు పడింది. అప్పటి వరకు మనం చూడని కష్టం అది. దీనితో జన జీవనం స్తంభించి పోయింది. ప్రజలు ఆర్ధికంగా చితికిపోయారు. నిరాశ్రయలు అయ్యారు. ఇంత కష్టంలోనే మనం 2021లో అడుగు పెట్టాము. కష్టాలు అన్నీ పోతాయి. మళ్ళీ మామూలు జీవితాన్ని గడపొచ్చు అనే ఆశతో అందరూ నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాము. కానీ.., 2021 ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేస్తోంది. పోయిందిలే అనుకున్న కరోనాని కొత్త వేరియంట్స్ గా వెనక్కి తీసుకొచ్చింది. ఏ దేశంలో పట్టినా సమస్యలే. ముందుగా ఈ ఏడాది కరోనా కొత్త వేరియంట్స్ కారణంగా అమెరికా, యూకేలో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆస్ట్రేలియా పరిస్థితి అయితే దారుణం. నిన్న మొన్నటి వరకు అక్కడ భారీగా వర్షాలు, వరదలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు ఎలుకల దండు అక్కడి ప్రజలకి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధంగా కారణంగా కొన్ని పదుల దేశాల్లో ప్రజలు భయం.. భయంగానే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇండియా ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు తుఫానులు దేశాన్ని వణికిస్తున్నాయి. ప్రపంచ దేశాలలో ఉన్న ఇన్ని సమస్యలకి తోడు ఇప్పుడు కొత్తగా భూకంపం కూడా ముంచుకొచ్చింది.
భూకంపంతో నేపాల్ వణికిపోయింది. భారీ భూ ప్రకంపనలు రావడం ప్రజలు బయటకి పరుగులు తీశారు. ఖాట్మండుకు సమీపంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగాసమాచారం అందుతోంది.ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందైంది. నేపాల్ లో గత ఆరు నెలల కాలంలో ఇలాంటి భూ ప్రకంపనలు రావడం ఇది రెండో సారి. బుధవారం ఉదయం 5.42 గంటల సమయంలో భూ కంపించింది. ఖాట్మండు నగరానికి 113 కిలోమీటర్ల దూరంలోని లాంజంగ్ జిల్లా భుల్ భులీ కేంద్రంగా భూకంపం వచ్చిందని అక్కడి జాతీయ భూకంపాల పరిశోధనా సంస్థ తెలిపింది.ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని జాతీయ భూకంపాల పరిశోధనా సంస్థ అధికారులు వెల్లడించారు. సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. బుధవారం ఉదయం అప్పుడప్పుడే నిద్ర లేస్తున్న నేపాలీలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. పెద్ద శబ్ధం రావడంతోపాటు నేల మొత్తం కదలినట్లుగా అనిపించిందని అంటున్నారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాస్త ఆస్తి నష్టం మాత్రం సంభవించింది. ఇక నేపాల్ దేశంలో ఇలాంటి భూకంపాలు సర్వ సాధారణం అయిపోయాయి. ఇక్కడ గతంలో సంభవించిన భూకంపం వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే.