ఆడ పిల్ల పుట్టిందని సంబర పడిపోయే లోపు.. పెళ్లి ఈడు వచ్చిందంటూ ఓ అయ్య చేతిలో పెడతారు. అతడూ బాగా చూసుకుంటే.. ఆ తల్లిదండ్రులు సైతం గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోతారు. కానీ అతడో కూతుర్ని పట్ల శాడిస్ట్ గా వ్యవహరిస్తే.. వారి వేదన వర్ణనాతీతం. అటువంటిదే యుపిలో చోటుచేసుకుంది.
అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబర పడిపోతారు తల్లిదండ్రులు. కను రెప్పలా కాపాడుకుంటారు. గారాబంగా పెంచుకుంటారు. ఒక్క దెబ్బ వేయడానికి కూడా ఆలోచిస్తారు. అందంగా ముస్తాబు చేసి.. ఆమెకు చేయాల్సిన శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక పెళ్లీడుకు వచ్చిన తర్వాత ఓ అయ్య చేతిలో పెడతారు. వచ్చే వ్యక్తి తమకెంటే బాగా చూసుకుంటాడన్న భరోసాతో పెళ్లి చేస్తారు. కానీ అటువంటి భర్త శాడిస్ట్ అయితే మహిళతో పాటు కుటుంబ సభ్యులు జీవితాంతం భాదపడాల్సిందే. భర్త తిడితేనో, కొడితేనో పడే ఆడేవాళ్లు ఉన్నారు కానీ మనసుకు నచ్చని పని చేయమంటే ఏ మహిళా చేయదు. అలా చేయలేని ఓ వ్యక్తి తన భార్యకు ఘోరమైన శిక్ష వేశాడు.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అలీషా, షరీక్ దంపతులు. వీరికి 5 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే భర్త పచ్చి తిరుగుబోతు అని తెలియడానికి ఆమెకు ఎంత కాలం పట్టలేదు. రోజూ తాగి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకునే వాడు. ఈ క్రమంలో ఓ రోజు మద్యం సేవించి, తన స్నేహితులను ఇంటికి తీసుకు వచ్చాడు. వారితో గడపాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దానికి ఆమె ససేమీరా అనడంతో తీవ్ర అసహనానికి గురైన భర్త .. ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చాడు. స్పృహ తప్పి పడిపోయిన భార్యకు గుండు కొట్టాడు. మెలుకువ వచ్చి ఆమె చూసుకోగా.. భర్త నిర్వాకం చూసి ఒక్కసారిగా ఆవేదన చెందింది. ఈ ఘటన లిసాడి గేట్ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది.
భర్త గుండు కొట్టించడంతో ఆవేదనతో పాటు అగ్రహానికి గురైన భార్య అలీషా పోలీసులను ఆశ్రయించింది. భర్త తనపై చేసిన అరాచకాలన్నీ చెప్పింది. అదనపు కట్నం తేవాలని వేధించడంతో పాటు తనను మద్యం సేవించి కొట్టేవాడని తెలిపింది. అంతే కాకుండా తనను వేరే వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని, అందుకు తాను నిరాకరించానని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తన భర్త మత్తు మందు ఇచ్చి, స్పృహ తప్పి పడిపోయిన తర్వాత గుండె కొట్టించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త షరీక్, అతని తల్లిదండ్రులు, అలీషాపై బలవంతానికి చేయడానికి ప్రయత్నించిన ఫరీక్ స్నేహితులను అరెస్ట్ చేశారు.