హెల్త్ డెస్క్- కరోనా వైరస్ మానవాళిపై దాడి చేస్తూనే ఉంది. యేడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని ఈ మహమ్మారి వణికిస్తోంది. కరోనాసెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటే.. వైరస్ రూపాన్ని మార్చుకుంటూ మరింత విస్తరిస్తోంది. వైరస్‌లో జన్యుమార్పిడులు ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా, డెల్లా ప్లస్ వేరియంట్ లు భయబ్రాంతులకు గురిచేస్తోంటే, తాజాగా లాంబ్డా అనే మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా కొత్త వేరియంట్ లంబ్డాను తమ దేశంలో గుర్తించినట్టు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తెలిపింది.
lamda
గత వారం ఇంగ్లండ్ లో నమోదయిన మొత్తం కరోనా కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ కాగా, అందులో లాంబ్డా వేరియంట్‌కు చెందిన 6 కేసులు కనుగొన్నట్టు పీహెచ్ఈ తెలిపింది. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో దాని ప్రభావంపై పరిశోధనలుకొనసాగుతున్నాయని పీహెచ్ఈ పేర్కొంది. ఐతే రెండు డోస్‌ల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు లంబ్డా వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఉండదనే అభిప్రాయాన్ని వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. లాంబ్డా వేరియంట్‌తో మరింత ఎక్కువ ప్రమాదం ఉందా, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లపై తక్కువ ప్రభావం చూపుతుందా అన్నదానిపై ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని, ఇంకా పూర్తి స్థాయి పరిశోధనలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.
లాంబ్డా వేరియంట్‌ను తొలిసారి గత సంవత్సరం ఆగస్టులో పెరు దేశంలో గుర్తించారని డబ్ల్యూహెచ్ తెలిపింది. ఈ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో కనిపించిందని, ముఖ్యంగా అర్జెంటీనా, చిలీ సహా లాటిన్ అమెరికాలో ఈ వేరియంట్ కేసులు ఉన్నాయని స్పష్టం చేసింది. గ్రీక్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఆధారంగా కొత్త వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్లును సూచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త వేరియంట్ కు లంబ్డా అని పేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా గతవారంతో పోల్చితే లంబ్డా వేరియంట్ కేసులు 46 శాతం మేర పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.