రెండేళ్ళ క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్ళిన వలస కూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. పనులు లేక, తినడానికి తిండి లేక అలమటించారు. సొంత ఊరు పోదామంటే బస్సులు, రైళ్ళు అన్నీ బంద్ అయ్యాయి. దీంతో వారు ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సోనూసూద్ లాంటి రియల్ హీరోలు తమ సొంత ఖర్చులతో బస్సులు వేసి వలస కూలీలను తమ సొంత గూటికి చేర్చారు. మరి కొంతమంది అయితే తమ దగ్గర పని చేసే కూలీలకు జీతాలు కూడా ప్రకటించారు. వీళ్ళలానే ఒక రైతు తన దగ్గర పనిచేసే రైతు కూలీలను వారి స్వస్థలాలకు చేర్చి పుణ్యం కట్టుకున్నాడు. అంతేకాదు వారు తిరుగు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాడు. అతనెవరో కాదు పప్పన్ సింగ్ గెహ్లట్.
బీహార్‌కు చెందిన రైతు కూలీలు బతుకుతెరువు కోసం ఢిల్లీలోని పప్పన్ సింగ్ ఫార్మ్‌లో పని చేస్తున్నారు. పప్పన్ సింగ్ పుట్టగొడుగుల వ్యవసాయం చేసేవారు. లాక్‌డౌన్‌లో ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉన్న పది మంది రైతు కూలీలను సొంత ఖర్చులతో విమానంలో పంపించి అప్పట్లో వార్తల్లో నిలిచాడు. ఢిల్లీ నుంచి పాట్నా పంపడం కోసం ఆయన ఏకంగా రూ. 70 వేలు ఖర్చు పెట్టాడు. దీంతో పప్పన్ సింగ్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో తన దగ్గర పనిచేసే కూలీల కోసం అంత డబ్బు ఖర్చు పెట్టారంటే గ్రేటే. తిరిగి వస్తారో లేదో అన్న అనుమానంతో కూలి డబ్బులే ఇవ్వని వారు ఉన్న ఈరోజుల్లో ఆయన అంత డబ్బు ఖర్చు పెట్టి విమానంలో పంపించారంటే ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
ఢిల్లీలోని అలిపోర్‌లో నివాసం ఉండే పప్పన్ సింగ్.. తన ఇంటి ముందు ఉన్న ఆలయంలో సీలింగ్‌కు ఉరి వేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకి చేరుకున్నారు. ఆయన ఒక సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. అనారోగ్యం కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని పప్పన్ సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎప్పుడూ సరదగా నవ్వుతూ, ఎదుటివారికి సాయం చేసే పప్పన్ సింగ్ గెహ్లట్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఆయనకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని కోరుకుందాం. మరి లాక్‌డౌన్‌లో వలస కూలీలను తన సొంత ఖర్చుతో విమానంలో వారి స్వస్థలాలకు పంపిన పప్పన్ సింగ్ మృతిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.