విశాఖటపట్నం- మరి కాసేపట్లో పెళ్లి మంటపంలో వివాహం జరగబోతోంది. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఆ యువతి సంతోషంతో ఎదురుచూస్తోంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడ్డాక అక్కడ కలకలం రేగింది. ఎందుకంటే కన్యాదానం చేసి, పెళ్లి కొడుకు కాళ్లు కడగాల్సిన పెళ్లి కూతురి తల్లి దండ్రులు హఠాత్తుగా మాయం అయిపోయారు. ఎంత వెతికినా వాళ్లు కనిపించలేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది.
విశాఖ పట్నంలో పోర్టు రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు, విజయలక్ష్మిల కుమార్తె పెళ్లికి గురువారం ముహూర్తం నిర్ణయించారు. బంధువులను పిలిచి ఘనంగా వివాహం చేయాలని ఏర్పాట్లు చేశారు. తీరా కన్యాదానం సమయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు కనిపించకుండా పోయారు. అసలేం జరిగిందో తెలియక పెళ్లికి విచ్చేసిన బంధువులంతా ఆందోళన పడ్డారు. కళ్యాణ మండపం సమిపంలో ఎంత వెతికినా వాళ్ల జాడ కనిపించలేదు.
ఎందుకైనా మంచిదని ఇంటికెళ్లి చూడటంతో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికూతురు తల్లి దండ్రులు గదిలో చనిపోయి కనిపించారు. మరి కాసేపట్లో కూతురి పెళ్లి జరగనుండగా వధువు తల్లిదండ్రులు ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. వధువు తల్లి విజయలక్ష్మి గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
విజయలక్ష్మి ఎప్పుడూ ఇంటి చుట్టుపక్కల వారితో గొడవ పడేదని, కూతురు పెళ్లి రోజు కూడా భర్తతో గొడవ పడటంతో ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు, ఆమెను చంపి, తానుకూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు తేసుకుని విచారణ చేపట్టారు.