అమరావతి- ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సాయంత్రానికి అసెంబ్లీ సమావేశాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన పూర్తిస్థాయి బడ్జెట్ ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఐతే శాసన సభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో భేటీలో నిర్ణయించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాత సమావేశాల రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి.
ఇక ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల మృతి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్లా రామకృష్ణ రెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు. ఐతే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న ఇటువంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐతే రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా గడువులోపు ఆర్ధిక బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలపాలి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందని జగన్ ప్రభుత్వం చెబుతోంది.