ఇంటర్నేషనల్ డెస్క్- బాహుభార్యత్వం మనం చాలా కాలంగా చూస్తూ వస్తున్నాం. ప్రపంచంలోని చాలా దేశాల్లో మగవారు ఒకరికి మించి పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఒక మగాడు ఇద్దరు, ముగ్గిరిని పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ మన పురాణాల్లో ద్రౌపదికి పాండవులు ఐదుగురూ భర్తలు. కర్ణుడు కుంతీపుత్రుడని తెలియడంతో ఆయన్నూ చేసుకోవాలని కోరుకుంది ద్రౌపతి. కానీ నిజ జీవితంలో మాత్రం ఒక మహిళ ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి. ఒక భర్తను మాత్రమే కలిగి ఉండాలి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోను ఇదే నిబంధన ఉంది. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో ఈ నిబంధనలో మార్పు వస్తోంది.
ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే స్వేచ్ఛ మగవారికి ఉన్నప్పుడు, ఒకరికంటే ఎక్కువ భర్తలను పొందే స్వేచ్ఛ మహిళలకు ఎందుకు ఉండకూదని దక్షిణాఫ్రికాలో ఓ ఉద్యమమే మొదలైంది. మహిళలు, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న సామాజికవేత్తలు ఈ మేరకు ఆందోళన చేపట్టారు. ప్రపంచంలో అత్యంత సరళీకృతమైన రాజ్యాంగవ్యవస్థ కలిగిన దేశాల్లో దక్షిణాఫ్రికా ముందుంటుంది. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉన్నాయి. తాజాగా బహుభర్తృత్వంపై వచ్చిన ప్రతిపాదనలనూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
మహిళలు ఒకరిని మించి పురుషులను పెళ్లాడే విధంగా చట్టంలో మార్పులు చేసే అంశంపై దక్షిణాఫ్రికా దృష్టి సారించింది. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలతో గ్రీన్ పేపర్ ను సిద్ధం చేసింది. ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ గ్రీన్ పేపర్‌ను జారీ చేసింది. అయితే బహుభర్తృత్వ ప్రతిపాదనలను అక్కడి సంప్రదాయవాదులు, కొన్ని మతసంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాఫ్రికా బుల్లితెర నటుడు మౌసా సెలేకూ నలుగురు భార్యలున్నారు, కానీ బహుభర్తృత్వం అమలైతే దేశ సంస్కృతి సర్వనాశనమవుతుందని ఈయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఓ మహిళ ఎన్నడూ పురుషుడి స్థానాన్ని భర్తీ చేయలేదని, బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుడితే ఎవరి తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని మౌసా సెలే ప్రశ్నించారు.