చిత్తూరు- దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలే కాదు.. కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులోను టమాట ధర ఐతే ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టమాట ఆల్ టైం రికార్డు ధరకు చేరుకుంది. దీంతో వినియోగదారులు టమట కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మన దేశంలో ఏ కూర వండినా అందులో కాస్త టమాటా వేయాల్సిందే.
ఐతే మార్కెట్లో టమాటోను టచ్ చేస్తే చాలు షాక్ కొడుతోంది. కిలో టమాట ఏకంగా 100 రూపాయలు పలుకుతోంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ధర అని వ్యాపారులు, రైతులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో 30 కిలోల టమాటా బాక్స్ ఏకంగా 3 వేల రూపాయలు పలుకుతోంది. దేశంలోని పెద్ద మార్కెట్లలో ఒకటిగా మదనపల్లె మార్కెట్‌కు గుర్తింపు ఉంది.
ఇక్కడ మేలిమి రకం టమోటా కిలో వంద రూపాయలకు చేరడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు. 2015 లో కిలో టమాటా ధర 98 రూపాయలు పలికింది. ఇప్పటివరకు ఇదే గరిష్టం. కానీ ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. కిలో టమాట ఏకంగా 100 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా భారీ వానలు కురుస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా టమాట పంట దిగుబడి తగ్గిపోవడంతో అమాంతం ధరలు పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు.
మార్కెట్ లోకి టమోటాలు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అకాల వర్షాల కారణంగా ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కూరగాయల సాగు దెబ్బతింది. దీంతో టమాటాకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో టమోటా ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది. తమిళనాడు, ఆంద్రప్రదేశ్ లో వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టం జరిగింది. మదనపల్లె మార్కెట్‌కు రోజూ సుమారు 300 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చేదని, మంగళవారం 148 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయని వ్యాపారులు చెప్పారు.