ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన డాన్స్ షోలలో ‘డాన్స్ ఐకాన్’ ఒకటి. ప్రముఖ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షోని ఓంకార్ నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా మొదలైన ఈ డాన్స్ రియాలిటీ షో.. ఇప్పటివరకు 7 వారాలు(14 ఎపిసోడ్స్) విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో వారం సందర్భంగా 15, 16వ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ప్రతి శని, ఆదివారాలలో ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ షోకి నటి రమ్యకృష్ణ, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో ఎపిసోడ్ ప్రోమో అంతా అదిరిపోయే పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంది. ఈ షోలో యాంకర్ శ్రీముఖి, యష్ మాస్టర్, మోనాల్ గజ్జర్ టీమ్ లీడర్స్ గా మూడు టీమ్స్ రన్ అవుతున్నాయి. అయితే.. ఈ ప్రోమోలో శ్రీముఖి టీమ్ నుండి ఆసిఫ్ పెర్ఫార్మన్స్ అందరినీ విశేషంగా ఆకర్షించింది. ఆసిఫ్ తో పాటు గాజువాక కండక్టర్ ఝాన్సీ పెర్ఫర్మ్ చేయడం విశేషం. అయితే.. పెర్ఫార్మన్స్ అయిపోయాక స్టేజిపై ఝాన్సీ ఎమోషనల్ అయ్యింది. ముఖ్యంగా తన తండ్రి కారణంగా కొన్నిసార్లు చనిపోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. తన తల్లి, తమ్ముడి కోసం డాన్స్ తో పాటు ఉద్యోగం సంపాదించుకొని పైకి వచ్చానని చెబుతూ కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.