ప్రేక్షకులను అలరించేందుకు బుల్లితెరపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి టీవీ ఛానల్ లో వినూత్నమైన కాన్సెప్ట్ లతో ప్రోగ్రామ్స్ జరుపుతూ ఆడియెన్స్ ని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ.. కొత్తగా వస్తున్న షోలు ప్రేక్షకులను కొద్దిరోజుల్లోనే ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో దశాబ్దానికి పైగా తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో అలరిస్తున్న యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న సరికొత్త షో ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతోంది.
ఈ షోలో పెళ్ళైన సెలబ్రిటీ కపుల్స్ ని పిలిచి వాళ్ళతో సరదా గేమ్స్ ఆడిస్తుంటాడు ప్రదీప్. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ లో సీరియల్ ఆర్టిస్ట్ మేఘన దంపతులు, సీరియల్ నటుడు అకుల్ బాలాజీ – జ్యోతి, యాంకర్ లాస్య – మంజునాథ్ జంటగా పాల్గొన్నారు. అయితే.. ప్రోమో అంతా చాలా సరదాగా సాగింది. చివరిలో యాంకర్ లాస్య ప్రెజెంట్ గర్భిణీ కాబట్టి.. దంపతులకు బొట్టు పెట్టి.. సారె అందించారు మేఘన, జ్యోతి. దీంతో లాస్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. లాస్య దంపతులకు ఆల్రెడీ ఓ కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.