సినీ ఇండస్ట్రీలో హిట్ ఇచ్చే కిక్కే వేరు. సక్సెస్ ఉంటేనే ఇక్కడ వేల్యూ ఉంటుంది. ఒకసారి విజయం ఇచ్చాము కదా.. కొన్ని ఫ్లాపులు వచ్చినా ఫర్వాలేదు అనుకోవడానికి ఏమీ లేదు. కంటిన్యూస్ గా హిట్స్ పడ్డప్పుడే కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా.. ఇప్పుడు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు కొంతమంది టాలీవుడ్ స్టార్స్. ‘మిర్చి’ ఆ తర్వాత ‘బాహుబలి 1 అండ్ 2’లతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ‘సాహో’ రూపంలో ఫ్లాప్ తగిలింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ‘సాహో’.. హిందీలో ఫర్వాలేదనిపించినా.. తెలుగులో మాత్రం నిరాశనే మిగిల్చింది. ఈనేపథ్యంలో.. ఇప్పుడు రాబోతున్న ‘రాధేశ్యామ్’తో ఖచ్చితంగా విజయం సాధించాలని పరిస్థితి ప్రభాస్ ది. లేదంటే బాహుబలి గాలి వాటం విజయమనే విమర్శలు మొదలవుతాయి.
ఇక నేటితరం అగ్ర కథానాయకులలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో.. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో.. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాతో.. బన్నీ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో విజయాలందుకున్నారు. అయితే.. ప్రెజెంట్ స్టార్ హీరోస్ లో ప్రభాస్ తర్వాత హిట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మరో కథానాయకుడు రామ్ చరణ్. ‘రంగస్థలం’తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్.. ఆ తర్వాత చేసిన ‘వినయ విధేయ రామ’తో పరాజయాన్ని పొందాడు. ఈనేపథ్యంలో.. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’.. రామ్ చరణ్ కు ఎంతో కీలకంగా మారింది. జక్కన్న క్రేజీ మల్టీస్టారర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మెగా పవర్ స్టార్.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండకు.. ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే.. ఎన్నో అంచనాలతో వచ్చిన విజయ్ ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు మాత్రం డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో.. ఇప్పుడు దేవరకొండ ఆశలన్నీ ‘లైగర్’ చిత్రంపైనే ఉన్నాయి. తొలిసారి పాన్ ఇండియా లెవెల్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది.
ఒకప్పుడు వరుసగా అరడజను విజయాలందుకున్న నానికి.. ఇప్పుడు హిట్ అనేదే ఎంతో అత్యవసరం. పోయినేడాది ఓటీటీలో రిలీజైన ‘వి’ సినిమా నేచురల్ స్టార్ ని తీవ్రంగా నిరాశపరిచింది. నాని కెరీర్ లో ప్రతిష్ఠాత్మక 25వ చిత్రంగా.. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘వి’ నెగటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఈనేపథ్యంలో.. ఇప్పుడు ‘టక్ జగదీష్’పైనే తన ఆశలు పెట్టుకున్నాడు నాని.
అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున-అఖిల్ ఇప్పుడు విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కుటుంబంలోని నాగచైతన్య వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. అఖిల్ మాత్రం ఫస్ట్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2 నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ త్వరలోనే విడుదలకానుంది. ఇక.. ‘వైల్డ్ డాగ్’తో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోన్న కింగ్.. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు మూవీతో ఫుల్ ఫ్లెడ్జ్ డ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
టాలీవుడ్ లో ఇంకా.. రానా, నితిన్, గోపీచంద్ వంటి వారు కూడా విజయం కోసం ఎదురుచూస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న యాక్షన్ స్టార్ గోపీచంద్.. ప్రస్తుతం ‘సీటీమార్’ మూవీతో ముస్తాబయ్యాడు. ఇక.. ‘బీష్మ’తో విజయాన్నందుకున్న నితిన్ కి.. ఆ తర్వాత వచ్చిన ‘చెక్’, ‘రంగ్ దే’ నిరాశపరిచాయి. ఇప్పుడు ‘మ్యాస్ట్రో’తో ప్రేక్షకుల్ని మురిపించడానికి సిద్ధమవుతున్నాడు. ‘అరణ్య’తో అలరించలేకపోయినా రానా కూడా ‘విరాటపర్వం’తో విజయాన్నందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. మొత్తంమీద.. మన టాలీవుడ్ స్టార్స్ కి అప్ కమింగ్ మూవీస్ ఎలాంటి అనుభూతిని అందిస్తాయో చూడాలి.