తెలుగు చిత్ర పరిశ్రమ మెల్లమెల్లగా రొటీన్ కథలను దూరం పెట్టి కొత్త కథలు, విభిన్నమైన ఐడియాలకు ఆస్కారం కల్పిస్తున్నట్లే అనిపిస్తుంది. నూతన దర్శకులను పరిచయం చేస్తూ ఇండస్ట్రీకి కొత్త కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తోంది. అదే కోవకి చెందిన చిత్రం ‘స్కైలాబ్’. నిజంగా జరిగిన స్కైలాబ్ ఇన్సిడెంట్ కు కామెడీ – ఫిక్షన్ జోడించి తెరకెక్కించే ప్రయోగం చేశారు. మరి ఆ సినిమా విశేషాలెంటో ఓసారి చూద్దాం.
కథ:
1979లో నాసా ప్రయోగించిన స్కైలాబ్ విఫలం అవ్వడంతో అది శకలాలుగా భూమి మీద పడబోతుందనే ఆకాశవాణి ప్రకటనతో సినిమా కథ మొదలవుతుంది. కరీంనగర్ జిల్లా, బండలింగంపల్లి అనే గ్రామానికి జమీందార్ వెంకట్రావు. ఆయన కూతురు గౌరి(నిత్యమేనన్) హైదరాబాద్ లో.. ప్రతిబింబం అనే దినపత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఊర్లో తండ్రికి ఆరోగ్యం బాలేదని ఉత్తరం రావడంతో సొంతూరుకు వచ్చేస్తుంది. కానీ పనితీరు నచ్చక పత్రికా వారు గౌరిని ఉద్యోగం నుండి తొలగించిన విషయం తర్వాత తెలుస్తుంది. తన ఊర్లోనే ఉండి మంచి కథరాసి ప్రతిబింబం పత్రికలో తన కథను చూడాలనే ఆలోచనతో గౌరి వెయిట్ చేస్తుంది. హైదరాబాద్ లోనే డాక్టర్ గా విఫలమై ఉద్యోగం కోల్పోయిన ఆనంద్(సత్యదేవ్) సొంతూరు బండలింగంపల్లికి తిరిగి వస్తాడు. ఎలాగైనా ఐదు వేలు సంపాదించి మళ్లీ డాక్టర్ లైసెన్స్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలో క్లినిక్ ప్రారంభిస్తాడు. అదే బండలింగంపల్లిలో నిండా అప్పులపాలై తిరుగుతుంటాడు సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ). ఈ ముగ్గురు స్కైలాబ్ పడుతుందనే సమయంలో గ్రామంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఆ గ్రామస్థులు స్కైలాబ్ భయం నుండి ఎలా బయటపడ్డారు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
1979 ప్రాంతంలో ఉండే పల్లె వాతావరణం, జనాల అమాయకత్వం, వారి భయాలు ఎలా ఉంటాయనే విషయాలను ఆధారంగా చేసుకొని.. కామెడీ జోడించి డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు మేకర్స్. ఆద్యంతం వినోదం – థ్రిల్లింగ్ అనే భావనను ప్రేక్షకులకు కలిగించాలని నూతన దర్శకుడు విశ్వక్ ఖండేరావు తపన సినిమాలో కనిపిస్తుంది. తొలి ప్రయత్నంలోనే వినోదాత్మకమైన కథాంశం ఎంచుకున్నాడు దర్శకుడు. స్కైలాబ్ ఫాల్ గురించి జనాలు ఎలా స్పందించారు? వారి ఆలోచనలు, చేష్టలను ఫన్నీ వేలో చూపించారు మేకర్స్. పృథ్వీ పిన్నమనేని నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్ట్ వర్క్ హైలెట్. 1970ల నాటి పల్లెటూరి సెటప్, కరీంనగర్ భాషా యాసా చాలా సహజంగా ఉందని చెప్పాలి. సినీమాటోగ్రాఫర్ పల్లెటూరిని షూట్ చేసిన విధానం బాగుంది. ప్రశాంత్ విహారి సంగీతం సినిమాకి అదనపు బలం. ఆ గ్రామంలో మనం ఉన్నామనే ఫీల్ తెప్పించడంలో అక్కడక్కడా మేకర్స్ ఫెయిల్ అయ్యారు. విమానం అంటేనే వింతగా చూసే జనాలు.. మరి అప్పటి రోజుల్లో స్కైలాబ్ అర్ధం తెలియకుండా భయపడిన సంఘటనలు, సన్నివేశాలు, ఎమోషన్స్ అందంగా చుపిఉంచారు.
నటీనటుల నటన: ఈ చిత్రంలో హీరో సత్యదేవ్ డాక్టర్ గా తన మార్క్ సహజమైన నటన కనబరిచాడు. కానీ ఎందుకో సత్యదేవ్ క్యాపబిలిటికి సరిపోయే పాత్ర కాదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సత్యదేవ్ కామెడీ సన్నివేశాల్లో ఆకట్టుకున్నా.. పడాల్సిన బలమైన సీన్స్ మాత్రం పడలేదు. రైటర్ గా నిత్యామీనన్ నటన జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆనాటి లుక్కు – హావభావాలను – అమాయకత్వాన్ని బాగా తన నటనలో పలికించింది. కమెడియన్ రాహుల్ రామకృష్ణ సుబేదార్ రామారావు పాత్రలో బాగా నవ్వులు పూయించాడు. ఇతర సహనటులు కూడా సినిమాలో వారి పరిధుల మేరకు ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్:
స్టోరీ లైన్
ప్రధాన తారాగణం నటన
సంగీతం
ప్రీక్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్
సాగదీసిన ఎమోషనల్ సీన్స్
చివరిమాట: అంచనాలకు దూరంగా పడిన స్కైలాబ్!