సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. విభిన్న చిత్రాల దర్శకుడు నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఒకవైపు రజినీకాంత్ మేనియా.. మరోవైపు తమన్నా ఆడిన ‘నువు కావాలయ్యా’ పాట బీభత్సం సృష్టించాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? లేదా? రివ్యూలో చూద్దాం.
చాలా రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రజనీకాంత్, బీస్ట్ పరాజయం తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ లిద్దరూ కూడా చాలా కసిగా చేసిన సినిమా జైలర్. సుమారు 200 కోట్ల రూపాయలతో సన్ పిక్చర్స్ వారు జైలర్ మూవీని నిర్మించారు. విడుదలకి ముందే నువ్వు కావాలయ్యా అనే సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న జైలర్ మూవీ ఈరోజు (ఆగష్టు 10న) విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
ముత్తు అలియాస్ ముత్తు వేలు పాండియన్ (రజనీకాంత్) ఒక రిటైర్డ్ జైలర్. ముత్తువేలుకి భార్య, కొడుకు, కోడలు, మనవడు ఉంటారు భార్య పేరు విజయ (రమ్యకృష్ణ), కొడుకు పేరు అర్జున్ (వసంత రవి). తన రిటైర్డ్ లైఫ్ ని కుటుంబంతో గడుపుతూ హ్యాపీగా ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ అయిన తన కొడుకుని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు చంపేస్తారు. దాంతో ముత్తువేలు రంగంలోకి దిగి తన కొడుకు చావుకి కారణమైన వాళ్ళని చంపుతాడు. అసలు తన కొడుకుని ఎందుకు చంపారు ? ముత్తువేలు వాళ్ళని ఎలా కనుక్కున్నాడు? పైగా ముత్తువేలు జైలర్ గా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేదే ఈ చిత్రం యొక్క పూర్తి కథ.
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఆహ్లాదకరంగా సాగిపోతుంది. రజనీకాంత్ రమ్య కృష్ణల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే రజని యోగిబాబుల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకుల చేత నాన్ స్టాప్ గా నవ్విస్తాయి. రజినీ గత చిత్రాలైన ముత్తు, నరసింహ, అరుణాచలంలో కామెడీని ఇంకోసారి గుర్తు చేసాయి. కథ పరంగా సినిమాని స్టెప్ బై స్టెప్ నిదానంగా ముందుకు తీసుకెళ్లిన దర్శకుడు ఇంటర్వెల్ మూమెంట్ వచ్చేసరికి ఒక్కసారిగా చేశాడు. మెయిన్ కథకి, ప్రస్తుతం జరుగుతున్న కథని లింక్ చేసేసరికి ఒక్కసారిగా సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి గూస్ బంప్స్ వస్తాయి. ఆ టైంలో రజనీ యాక్టింగ్ మాములుగా ఉండదు. పోరాటానికి సిద్ధంగా ఉండే ఒక సింహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
తన కొడుకుని చంపిన వాళ్ళని చంపే క్యారెక్టర్ లో రజనీ పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ లో ఉంటుంది. అలాగే ఆడియన్స్ కి సర్ప్రైజ్ ని ఇచ్చే క్యారెక్టర్ లో మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటించి సినిమాకి ఇంకొంచెం నిండు ధనాన్ని తెచ్చారు. తమన్నా తన అందచందాలతో డాన్స్ లతో సినిమాకి మంచి మైలేజ్ ఇచ్చింది. మన సునీల్ చక్కని పాత్రల్లో నటించాడు. వినాయకన్ విలనిజం బాగుంది. నెల్సన్ దర్శకత్వం కూడా బాగుంది. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో స్క్రీన్ ప్లే చాలా వేగంగా దూసుకెళ్తుంది. కాకపోతే కొద్దిరోజుల క్రితం వచ్చిన కమల్ హాసన్ హిట్ మూవీ విక్రమ్ మూవీ కథకి, ఈ కథకి చాలా దగ్గర పోలికలు ఉండడంతో కాస్త నిరాశ పరుస్తుంది.
రజనీకాంత్ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు .రజని స్టైల్ కామెడీ సూపర్ గా చేసాడు. తన కొడుకుని చంపిన వాళ్ళ మీద పోరాడుతున్నప్పుడు రజని మాస్ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. భర్తని ప్రేమించే భార్యగా రమ్యకృష్ణ సూపర్ గా చేసింది. తమన్నా కూడా తన పాత్ర వరకు బాగా చేసింది. విలన్ అండ్ మిగతా పాత్రలు పోషించిన వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు.
నెల్సన్ దిలీప్ దర్శకత్వం చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో నెల్సన్ టేకింగ్ సూపర్బ్ ఉంటుంది. కెమెరా పనితనం కూడా బాగుంది. సినిమాని ఒక విజువల్ వండర్ గా కూడా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. అనిరుద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా రజిని హీరోయిజానికి సంబంధించిన సాంగ్, తమన్నా నువు కావాలయ్యా సాంగ్ కి అయితే థియేటర్స్ మొత్తం విజిల్స్ తో మారుమోగిపోయింది.
చివరిగా: జైలర్.. రజనీ అభిమానులు ఎగరేసుకోవచ్చు కాలర్..
రేటింగ్: 2.75/5