సినిమా రిలీజ్ అవ్వడమే లేటు.. థియేటర్ కి వెళ్లి చూసేవాళ్లు కొందరైతే.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు మరికొందరు. అందుకు తగ్గట్లే ఆయా ఓటీటీ సంస్థలు కొత్తగా రిలీజైన మూవీలను ఆయా ప్లాట్‌ఫార్మ్‌లలోకి తీసుకొస్తూ.. క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. అలా గతేడాది 9న రిలీజైన ‘గుర్తుందా శీతాకాలం‘ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా, మేఘ ఆకాష్‌లు నటించారు.
కన్నడలో విజయవంతమైన ‘లవ్ మాక్‌టెయిల్’ అను చిత్రానికి తెలుగు రీమేకే గుర్తుందా శీతాకాలం. తెలుగు నేటివిటికి తగినట్టు కొన్ని మార్పులు చేసి ఈ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. ఇలాంటి ప్రేమ కథలు ఎన్ని వచ్చినా సరే.. వాటిపై ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ తగ్గదు. కాకుంటే.. తెరపై చూపించే విధానంలో వైవిద్యం ఉండాలి. కానీ గుర్తుందా శీతాకాలంలో అది మిస్ అయింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన దేవ్ స్కూల్ డేస్‌లో ఒక అమ్మాయిని, కాలేజీ డేస్‌లో మరో అమ్మాయితో లవ్‌లో పడతాడు. స్కూల్ డేస్‌లో విఫలమైనా కాలేజీ లవ్ లో అమ్ము అలియాస్ అమృత(కావ్యా శెట్టి)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే అనుకోని కారణాల రీత్యా ఆమె కూడా దూరమవుతుంది. ఆ తర్వాత దేవ్ జీవితంలోకి నిధి(తమన్నా) వస్తుంది. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి అన్నదే మిగతా కథ.
సాధారణంగా లవ్‌స్టోరీ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హిట్టా.. ఫట్టా అని చూడరు. సినిమా చూడాలంతే .. అన్నట్లుగా ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఈ సినిమా మిస్ అయ్యుంటే.. అమెజాన్‌లో చూసేయచ్చు. ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాల భైరవ సంగీతం అందించాడు. కాగా, గుర్తుందా శీతాకాలం ఓరిజినల్ వెర్షన్ ‘లవ్ మాక్‌టైల్’ కూడా అమెజాన్లోనే స్ట్రీమింగ్ అయ్యింది. సినిమా చూశాక ఎలా ఉందో.. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.