చైతన్య రావ్, లావణ్య జంటగా.. ‘ఓ పిట్ట కథ’ ఫేమ్ చెందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని రూపొందించిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కొత్తదనంతో, కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రాలు ఆకట్టుకుంటే వాటిని తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పీరియాడిక్ కథలతో చిన్న సినిమాలు రూపొందడం అరుదు. కథకి తగిన వాతావరణాన్ని పున:సృష్టించి చిత్రీకరించడం అంత తేలికైన విషయం కాదు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఆ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (ఇచ్చట ఫొటోలు అందంగా తీయబడును). విభిన్న కథలతో అలరించే చైతన్య రావ్ హీరోగా, యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య హీరోయిన్‌గా.. ‘ఓ పిట్ట కథ’ తో దర్శకుడిడా నిరూపించుకున్న చెందు ముద్దు తెరకెక్కించిన రెండో సినిమా ఇది. ‘పెళ్లిచూపులు’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల నిర్మాత యష్ రంగినేని రూపొందించారు. ప్రోమోలతో ఫీల్ గుడ్ ఫిలిం అనే అనుభూతి కలిగించిన ఈ చిత్రం నేడు (జూలై 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
1980 దశకంలో గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం అనే అందమైన గ్రామంలో చంటి (చైతన్య రావ్) తన స్నేహితుడితో కలసి తల్లి పేరు మీద ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నడుపుతుంటాడు. జోతిష్యుడైన తన తండ్రికి చుట్టు పక్కల మంచి పేరు. చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. చెల్లెలు చదువుతున్న కాలేజీలోనే చదివే గౌతమి (లావణ్య)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా చంటిని ఇష్టపడుతుంది. వీళ్ల ప్రేమకథకు కంచికి చేరినట్టే అనుకునేలోపే విషయం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెప్తాడు. అది తెలిశాక గౌతమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది?, అసలు చంటి ఓ హత్య కేసులో నిందుతుడిగా ఎలా మారాడు?, ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు?.. చివరకు చంటి, గౌతమిల ప్రేమకథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.
స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ ఇది. టెక్నాలజీ లేని ఆ రోజలు ఎలా ఉండేవో.. మనుషుల్లోని అమాయకత్వం ఎంత అందంగా ఉండేదో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. కల్మషం లేన పాత్రలు, అందమైన విజువల్స్, వినసొంపైన సంగీతంతో 80ల కాలాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు మనసుల్ని హత్తుకుంటుంది. ప్రేమకథతో పాటు ఓ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. హీరో సూసైడ్ అటెంప్ట్, అక్కడ దొరికిన లెటర్‌తో అసలు కథ మొదలువుతుంది. పెళ్లి కావడం లేదని ఫ్రెండ్స్ ఏడిపపించినా వాటన్నిటినీ సరదాగా తీసుకుంటూ.. ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా గడిపే కుర్రాడు ఓ దశలో హత్యాలు చేయాలని నిర్ణయానికొస్తూ ఉంటాడు. అప్పటిదాకా సరదా సరదా సన్నివేశాలతో హాయిగా సాగే కథ, హత్య ప్రస్తావన వచ్చేటప్పటికి ఓ కొత్త మలుపు తీసుకుని ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది.
అలా కథను నడుపుతూ వెళ్లిన దర్శకుడు చివర్లో మరికొన్ని మలుపులతో ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతినిస్తాడు. ఫస్టాఫ్‌లో కామెడీ ఎక్కువ. హీరో పెళ్లి కష్టాలు, హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ, ఫ్రెండ్స్ హంగామా నవ్విస్తాయి. సెకండాఫ్‌లో క్రైమ్ ఎలిమెంట్స్ కారణంగా కామెడీ డోస్ కాస్త తగ్గినట్టనిపిస్తుంది. అప్పటి రోజులు, మనుషులు, వాతావరణం ఆస్వాదించాలనుకునే వారిని ఈ సినిమా బాగా మెప్పిస్తుంది. ఫీల్ గుడ్ సాంగ్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అయితే 80ల నేపథ్యంలో మలిచిన కథకు, అప్పటి సినిమాలను పోలినట్టుగానే సన్నివేశాలను రూపొందించడం కాస్త ఇబ్బంది పెడుతుంది. కథ, కథనాలు సాగే విధానంలోనూ వేగం నెమ్మదించింది.
వయసు మీద పడిన కుర్రాడిగా మరోసారి ఆకట్టుకున్నాడు చైతన్య రావ్. ‘30 వెడ్స్ 21’ సిరీస్‌లో ఇలాంటి పాత్రే చేసిన చైతన్య ఇందులో వింటేజ్ లుక్‌లో కనిపించిన తీరు, గోదావరి యాసతో పాటు కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. గౌతమిగా లావణ్య అచ్చ తెలుగమ్మాయిలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. తన సహజమైన నటనతో మెప్పించింది. చంటి చెల్లెలు పద్దు పాత్రలో ఉత్తర, ఫ్రెండ్‌గా లలిత్ ఆదిత్య, మరో పాత్రలో మిహిరా మంచి నటన కనబరిచారు. ఇక నిర్మాత యష్ రంగినేని కథను మలుపుతిప్పే కీలక పాత్రలో కనిపించారు. క్లైమాక్స్‌లో ఆయ రోల్, పర్ఫార్మెన్స్ ప్లస్ అయ్యాయి.
దర్శకుడు చెందు ముద్దు కొత్త నటులతో సహజమైన నటనని రాబట్టుకున్నారు. ఆ కొత్తదనమే సినిమాకు బలం. తాను అనుకున్న కథను పక్కాగా తెరపైకి తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా మాటలతో మెరిపించారు. కాకపోతే కథ, కథనాల రచనలో ఆయన మరింత శ్రద్ధ పెట్టుంటే సినిమా వేరేలా ఉండేంది. టెక్నికల్‌గా మూవీ హై రేంజ్‌లో ఉంది. పంకజ్ తొత్తడ సినిమాటోగ్రఫీ కీ రోల్ ప్లే చేసింది. ఎడిటింగ్ కాస్త వేగం పెరిగేలా ఉంటే బాగుండేంది. ప్రిన్స్ హెన్రీ పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
చివరగా: మనసుని హత్తుకునే స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’
రేటింగ్: 2.5/5