పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన మూవీ.. ‘బ్రో’ (ది అవతార్). నేడు (జూలై 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన మూవీ.. ‘బ్రో’ (ది అవతార్). పి.సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. పవన్ కెరీర్‌లో తక్కువ రోజుల్లో పూర్తి చేసిన చిత్రమిదే. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నేడు (జూలై 28) విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
మార్కండేయ (సాయి ధరమ్ తేజ్) తండ్రి మరణంతో బాధ్యతలన్నీ తన భుజానికెత్తుకుని.. తండ్రి కంపెనీని నిలబెట్టడానికి చాలా కష్టపడుతుంటాడు. పని బిజీలో పడి, టైం లేదంటూ ఫ్యామిలీని పట్టించుకోడు. కనీసం మాట్లాడడు కూడా. ఆ కారణంగా ప్రేమించిన అమ్మాయి కూడా బ్రేకప్ చెప్పే పరిస్థితి వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే మార్కండేయకు ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు తన కుటుంబం, బాధ్యతలు అన్నీ గుర్తొస్తాయి. సరిగ్గా ఆ సమయంలో తనకు ‘టైం’ (పవన్ కళ్యాణ్) కనిపిస్తాడు. తన కంపెనీని నిలబెట్టడానికి, తమ్ముడికి ఆ బాధ్యతలు అప్పజెప్పి, సోదరికి పెళ్లి చేసి వస్తాను. దానికి కాస్త టైం కావాలని అడగడంతో.. నీతో పాటు నేను కూడా వస్తానని కండీషన్ పెడతాడు ‘టైం’. దానికి మార్కండేయ కూడా ఒప్పుకుంటాడు. వీరిద్దరి మధ్య ఇన్ని ఒప్పందాలు ఎదురైన తర్వాత మార్క్ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతను అడిగినంత టైం ఇచ్చిన తర్వాత చివరకు ‘టైం’ ఏం చేశాడు? అనేది మిగతా కథ.
‘బ్రో’ ఫస్టాఫ్ అంతా కామెడీగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంటుంది. ఎప్పుడైతే పవన్ ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుండి సినిమా గ్రాఫ్ పెరిగిపోతుంది. తేజ్, కేతికల కెమిస్ట్రీ, లవ్ ట్రాక్, ఫ్యామిలీ సీన్స్, కామెడీ, డైలాగ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఒక భాషలో హిట్ అయిన మూవీ రీమేక్ అనగానే పాజిటివ్ వైబ్స్ వినిపిస్తుంటాయ్. కానీ రీమేక్ అనేది కత్తి మీద సాము లాంటిది. నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు, చేర్పులు చేసినా.. అందులోని ఆత్మ మిస్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఆ విషయంలో సముద్రఖని, త్రివిక్రమ్ న్యాయం చేశారు. తమిళంలో రచన, దర్శకత్వంతో పాటు పవన్ క్యారెక్టర్‌ని సముద్రఖని చేసి మెప్పించారు.
పని ఒత్తిడిలో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం.. తను ఏదైతే టైం లేదు అనే సాకు చెప్పుకుంటూ వచ్చాడో చివరకు దేవుడే ఆ టైం రూపంలో వచ్చి తనకు మరికొంత టైం ఇవ్వడం.. మనిషిగా బతికున్నప్పుడు తాను కోల్పోయిన బంధాల యొక్క విలువలను తెలుసుకోవడం.. కథగా చెప్పడానికి సింపుల్‌గా అనిపించినా దాన్ని నేటి సమాజంలో మనిషి జీవన విధానాన్ని ప్రతింబింబించేలా, అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కించడం గ్రేట్.
సినిమాకి మెయిన్ పిల్లర్, ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్.. యాక్టింగ్, స్టైల్, స్వాగ్, ఎనర్జీ, వింటేజ్ లుక్స్, కామెడీ టైమింగ్‌తో రఫ్ఫాడించేశాడు. తన గత చిత్రాల్లోని బ్లాక్ బస్టర్ పాటలతో ఫ్యాన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మార్కండేయ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పవన్-తేజ మధ్య సీన్స్ అలరిస్తాయి. కేతిక, ప్రియా ప్రకాష్, రోహిణి, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు పాత్రల పరిధి మేరకు చక్కగా చేశారు.
సముద్రఖని కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు త్రివిక్రమ్ కాస్త మార్పులవీ చేసి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. సినిమాలో త్రివిక్రమ్, సముద్రఖని ఇద్దరూ కీలక పాత్ర ప్లే చేశారనే చెప్పాలి. సుజిత్ వాసుదేవన్ తన ఫ్రేమ్స్‌తో సినిమాను అందంగా తీర్చిదిద్దాడు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా ఓకే. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ మరో బిగ్గెస్ట్ ఎసెట్. సాంగ్స్ పర్వాలేదు అనిపించినా కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో చెలరేగిపోయాడు. ‘బ్రో’ థీమ్ సాంగ్ వస్తున్నప్పుడైతే బాక్సులు బద్దలైపోతాయేమో అన్నంత లౌడ్‌గా ఇచ్చి పడేశాడు.
చివరగా: అభిమానులతో పాటు ప్రేక్షకులనూ మెప్పించే ‘బ్రో’
రేటింగ్: 3.25/5