పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం వ్యక్తి మాత్రమే కాదు, తన మాటలతో ఎంతోమందిని కదిలించగల శక్తి. ఆయన మాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఉద్యమం లోంచి పుట్టుకొచ్చిన మాటలు ఒక్కొక్కటి రామబాణాల్లా తగులుతాయి. జనం గుండెల్లో విప్లవ జ్యోతి రగిలించి చైతన్యం తీసుకురాగల సత్తా పవన్ ది. నిజానికి పవన్ కళ్యాణ్.. యువతను సినిమాలతో ప్రభావితం చేసిన దానికంటే నిజ జీవితంలో తన మాటలతో, తన చేతలతో ప్రభావితం చేసిన సందర్భాలే ఎక్కువ. అందుకే యువతలో స్ఫూర్తి నింపేందుకు పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు. హార్వర్డ్ యూనివర్సిటీ సైతం పవన్ ని ప్రసంగించమని పిలిచిందంటే అది పవన్ స్థాయి.
ఇక తాజాగా పవన్ హైటెక్ సిటీ, శిల్పకళావేదికలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. సీఏ స్టూడెంట్స్ తో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ లో భాగంగా సీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన తన సినీ, రాజకీయ విశేషాలను సీఏ విద్యార్థులతో పంచుకున్నారు. అయితే ప్రసంగం మధ్యలో తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ ని అని అన్నారు. రాజకీయాల్లో తాను ఫెయిల్ అయ్యానని అనగానే.. సభా ప్రాంగణంలో ఉన్న సీఏ స్టూడెంట్స్ ఒక్కసారిగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీన్ని నేను అంగీకరించాలని, రాజకీయాల్లో ఫెయిల్ అయినందుకు తానేమీ బాధపడడం లేదని అన్నారు. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి సగం అడుగు దూరంలో ఉంటుందని అన్నారు.
ఓటమితో తాను మరింత నేర్చుకునే అవకాశం ఉంటుందని, మరింత సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. చాలా మంది సొసైటీలో మార్పు వస్తే బాగుణ్ణు అని అనుకుంటారు గానీ కంఫర్టబుల్ ప్లేస్ లోంచి బయటకు రారు అంటూ కామెంట్స్ చేశారు. అయితే తాను అలా ఉండలేనని, సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కనీసం ప్రయత్నించానని అన్నారు. అందుకు నేను ఓటమి గురించి బాధపడడం లేదని అన్నారు. రాజకీయ నాయకుడిగా ఓడిపోయినా గానీ పెద్దగా బాధపడనని అన్నారు. ఈ సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి శాశ్వతం కాదని, పాసింగ్ క్లౌడ్స్ లాంటివని అన్నారు. సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని ఎక్కువగా మనసుకు తీసుకోకండి అని.. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా రియాక్షన్ ఒకేలా ఉండాలని ఆయన సీఏ విద్యార్థులకు సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పవన్ కళ్యాణ్ అన్న నువ్వు ఫెయిల్యూర్ పొలిటీషియన్ వి కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత పరిపక్వత ఉన్న నీవు ఓడిపోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.