ఈ మధ్య రీ రిలీజ్ హవా ఎక్కువగా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పాత సినిమాలను వారి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయడం ఇప్పుడున్న ట్రెండ్. పాత సినిమాలో తమ హీరోలను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరో పాత సినిమాలు మళ్ళీ చూసేందుకు ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో వస్తుండడంతో వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా కొత్త చిత్రాల కంటే, పాత సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా.. రీ రిలీజ్ చిత్రాలే సందడి చేస్తున్నాయి. కొత్త సినిమాలు నచ్చకనో, పాత సినిమాల మీద ఇంట్రెస్టో.. కానీ ఇప్పుడంతా రీ రిలీజ్ మేనియా నడుస్తోంది. పోకిరి సినిమాతో మహేష్ బాబు మొదలుపెట్టిన ఈ ట్రెండ్ మరిన్ని సినిమాలకు బాటలు వేసింది. పోకిరి తర్వాత వచ్చిన చెన్నకేశవరెడ్డి, ఘరానా మొగుడు, ఖుషి ఆరెంజ్, సింహాద్రి, దేశముదురు ఇలా చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే కలెక్షన్ తెచ్చిపెట్టాయి. తాజాగా బిజినేస్‌మెన్ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత కూడా సూర్య భాయ్ క్రేజ్ తగ్గలేదు. రీ రిలీజ్ మూవీస్‌లో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది బిజినెస్ మేన్.
అయితే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.42 కోట్లు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ముందు 4.15 కోట్లతో ఖుషి సినిమా మొదటి స్థానంలో ఉంది. అంతకు ముందు పోకిరి మొదటి రోజు 1.7 కోట్లతో అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాని తర్వాత వచ్చిన జల్సా 2.6 వసూళ్లు చేసి పోకిరి రికార్డ్‌స్ ని దాటింది. ఆ వెంటనే ఖుషి వచ్చి అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది. ఆ వరుసలో ఆరెంజ్, వర్షం, దేశముదురు, ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలు వచ్చినా.. ఖుషి సినిమా రికార్డ్స్ ని మాత్రం దాటలేకపోయాయి. కానీ.. సూర్య భాయ్ దాటేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘బిజినెస్‌మెన్’. తన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న థియేటర్లలో రీ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో మహేష్ బాబు గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. ఇందులో మహేష్ డైలాగ్స్, ఆటిట్యూడ్, ఈ సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్ళాయని చెప్పొచ్చు. తాజాగా రీ రిలీజ్ అయిన బిజినెస్ మేన్ ప్రపంచవ్యాప్తంగా 5.31 కోట్ల గ్రాస్‌తో రీ రిలీజ్‌లలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రీ రిలీజ్ ల విషయానికొస్తే ఈ నెలలో ప్రభాస్ నటించిన యోగి, ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్, డీజే టిల్లు లాంటి సినిమాలు రీ రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ సినిమాలు విడుదల చేయనున్నారు. మరి రాబోయో సినిమాలలో ఏ సినిమా బిజినెస్ మేన్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి.