తెలుగునాట రీమేక్ లు కొత్త కాదు. విక్టరీ వెంకటేశ్ ఈ రీమేక్ సినిమాలకి కేరాఫ్. అయితే.., నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అసురన్ రీమేక్ కి వెంకటేశ్ ఓకే చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అసురన్ ఓ అద్భుతం. ఆ ఫీల్ ని మళ్ళీ రిపీట్ చేయడం కష్టం అని అంతా పెదవి విరిచారు. కానీ.., వెంకటేశ్ మాత్రం నారప్ప విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్టు ముందుకి వెళ్ళాడు. ఎన్నో అవాంతరాల తరువాత ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో నారప్ప ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. నారప్ప ఫలితం ఎలా ఉంది? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
అనంతపురం జిల్లా రామసాగరం గ్రామానికి చెందిన నారప్ప కుటుంబానికి, భూస్వామి పండుస్వామికి మధ్య భూ తగాదా చోటు చేసుకుంటుంది. నారప్పకు మూడు ఎకరాల భూమిపై అతని కన్ను పడుతుంది. నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా పండుస్వామి ప్రయత్నాలను అడ్డుకుంటాడు. పండుస్వామి దుర్మార్గాలు ఎక్కువ కావడంతో అతన్ని చెప్పుతో కొట్టి బుద్ది చెప్తాడు. దీంతో పగ పెంచుకున్న పండుస్వామి.. తన మనుషులతో మునిఖన్నాని హత్య చేయిస్తాడు. అక్కడ నుండి నారప్ప తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు ఈ నారప్ప ఎవరు? అతని గతం ఏమిటి? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ:
నారప్ప సినిమా పైకి మాత్రం కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి మధ్య జరిగిన భూ తగాదా కథలా కనిపిస్తుంది. కానీ.., నారప్ప లో అంతర్గళంగా ఉన్న కథ మాత్రం వేరు. అప్పట్లో కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉండేదో ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇక ప్రీ క్లయిమ్యాక్స్ ముందు ఒక డైలాగ్ ఉంటుంది. “ఆత్మభిమానం కోసం మనం వాళ్ళని చంపినా.., వాళ్ళు దొంగలుగా గానే ముద్ర వేస్తారు. కనీసం చావులో కూడా మనకి గౌరవం దక్కనివ్వరు బావ” ఈ ఒక్క డైలాగ్ నారప్ప మొత్తం కథని జస్టిఫై చేస్తుంది. ఇక నారప్పగా విక్టరీ వెంకటేశ్ తన నట విశ్వరూపాన్ని చూపించేశాడు.
ఇన్ని రోజులు ధనుష్ తో తనని పోలుస్తూ.., ఎగతాళి చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్ తన నటనతోనే సమాధానం చెప్పాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. ఒరిజినల్ ని కట్ కాపీ పేస్ట్ అన్నట్టు తీయడం ఒక్కో దగ్గర సినిమాకి బలం అయితే.., కొన్ని సన్నివేశాల విషయంలో అదే బలహీనత అయ్యింది. తెలుగుకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ప్రియమణి, రాజీవ్ కనకాల, నారప్ప పెద్ద కొడుకుగా పాత్రలో నటించిన కార్తీక్ రత్నం, చిన్న కొడుకు పాత్రలో నటించిన రాఖీ సైతం నటనలో మెప్పించారు. ఇక లాయర్ పాత్రలో నటించిన రావు రమేశ్ తన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. మణిశర్మ మ్యూజిక్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అసురన్ నుండి తీసుకుందే. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బాలలు:
వెంకటేశ్ నటన
సిన్నప్ప క్యారెక్టర్
ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు
మైనస్ :
స్లో నేరేషన్
నేటివిటీ కి తగ్గ మార్పులు చేయకపోవడం
యాస విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం
చివరి మాట:
నారప్ప యాక్టింగ్ నరికేశాడప్ప. మూవీ ఆకట్టుకుంది.