ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. మన పక్కనే ఉంటూ.. మనకి వెన్ను పోటు పొడిచేవారే ఈ సమాజంలో చాలా మంది కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపారవేత్త చేతిలో ఓ ఎంపీ మోసపోయాడు అనే వార్త హాట్ టాపిక్ గా మరింది. అతడు ఎంపీనే కాదు.. ఓ సినీ నటుడు కూడా. తనదైన విలనిజంతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మరెవరో కాదు.. నటుడు రవికిషన్. అవును ఎంపీ రవికిషన్ ముంబాయికి చెందిన ఓ వ్యాపార వేత్త చేతిలో రూ. కోట్లల్లో మోసపోయాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రవికిషన్.. రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తనదైన విలనిజంతో చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అదీ కాక ఎంపీగా అటు రాజకియాల్లో సైతం ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు ముంబాయికి చెందిన వ్యాపారవేత్త అయిన జితేంద్ర రమేశ్ చేతిలో రూ.3.25 కోట్లు మోసపోయినట్లు తెలిసింది. ఈ మేరకు రవికిషన్ పీఆర్వో పవన్ దూబే ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జితేంద్ర రమేశ్ కు ఎంపీ రవికిషన్ 2012 లో వ్యాపార నిమిత్తం రూ. 3.25 కోట్లు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆ డబ్బులను జితేంద్ర తిరిగి ఇవ్వలేదు.
దాంతో రవికిషన్ తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరగా.. రూ.34 లక్షలను 12 చెక్కుల రూపంతో జితేంద్ర ఇచ్చాడు. ఆ చెక్కుల్లో ఒక చెక్కును పోయిన ఏడాది డిసెంబర్ 7న బ్యాంక్ లో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయ్యింది. దాంతో రవికిషన్ మరోమారు జితేంద్రతో చర్చలు జరిపాడు. అయినప్పటికీ చర్చలు సఫలం కాలేదు.. అతడి డబ్బురాలేదు. దీంతో ఉపయోగం లేదు అనుకున్న ఎంపీ రవికిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న కంటోన్మెంట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక రవికిషన్ బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యునిగా గెలుపొందిన విషయం మనకు తెలిసిందే.