ఇండస్ట్రీలో ఓవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు వేరే సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేయడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే.. హీరోయిన్ గా సినిమా మొత్తం కనిపించిన దానికంటే, ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తే వచ్చే క్రేజ్ రెట్టింపుగా ఉంటుందని అంటున్నాయి సినీవర్గాలు. దీంతో స్టార్ హీరోయిన్స్ అంతా అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అదీగాక సినిమాలో హీరోయిన్ గా కనిపించినా, ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ చేసినా ఒకే రెమ్యూనరేషన్ వస్తుందనేది మరో వాదన. ఈ క్రమంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న కాజల్ అగర్వాల్ త్వరలోనే ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించనుందని టాక్.
కాజల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు పదేళ్లకు పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అలాగే తెలుగులో ఉన్న స్టార్ అందరి సరసన హీరోయిన్ గా సినిమాలు చేసింది కాజల్. స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ మూవీలో ‘పక్కా లోకల్’ అనే ఐటమ్ సాంగ్ చేసింది. ఆ పాటలో కాజల్ కనిపించి అందాల విందు చేసేసరికి ఆ సాంగ్ ఎంత హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత లాక్ డౌన్, తన వ్యక్తిగత కారణాల వలన కాజల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్.. తాను హీరోయిన్ గా నటించిన హీరో సినిమాలోనే మరో ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం కాజల్ ని సుకుమార్ సంప్రదించడం.. అందుకు కాజల్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. అయితే.. బన్నీ – సుకుమార్ కాంబోలో ఆర్య-2 సినిమా చేసింది కాజల్. ఇప్పుడు వారి కాంబోలోనే ఐటమ్ సాంగ్ చేయబోతుండటం విశేషం అంటున్నారు ఫ్యాన్స్.
ఇక పుష్ప విషయంలో కూడా ఇలాంటి సీనే మనం చూశాం. అల్లు అర్జున్ తో హీరోయిన్ గా సినిమాలు చేసిన సమంత.. పుష్పలో బన్నీ సరసన ఐటమ్ సాంగ్ లో ఆడిపాడింది. ఆ సాంగ్ వరల్డ్ వైడ్ మాస్ ఆడియెన్స్ కి బాగా రీచ్ అయ్యింది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ రాబోతుందనే వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. పుష్ప సిరీస్ లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మ్యూజికల్ గా పుష్ప ఆల్బమ్ ఏ స్థాయిలో హిట్టయిందో తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2 కోసం కూడా అద్భుతమైన బాణీలను సిద్ధం చేస్తున్నాడట దేవి. మరి పుష్ప 2లో కాజల్ ప్రత్యేక గీతంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.