టాలీవుడ్ లో రెగ్యులర్ గా ట్రోల్స్ కి గురయ్యేవారిలో మంచు విష్ణు ఒకరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విష్ణు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ.. కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. మంచు విష్ణుపై ట్రోల్స్ అసలు ఎప్పుడు, ఎందుకు మొదలయ్యాయో తెలియదు. విష్ణు ఏం చేసినా ట్రోల్స్ తో ట్రెండ్ చేసేస్తుంటారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ తనను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని, వాళ్ళను వదిలిపెట్టమని ఇటీవల జిన్నా మూవీ ప్రమోషన్స్ లో ట్రోలర్స్ కి వార్నింగ్ ఇచ్చాడు మంచు విష్ణు.
ఓవైపు మా ప్రెసిడెంట్ గా కొనసాగుతూనే, మరోవైపు హీరోగా విభిన్నమైన సినిమాలతో మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు విష్ణు. ఇక తాజాగా జిన్నా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయర్స్‌తో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. “మా ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుండి ఓపికగా చూస్తున్నాను. అప్పుడంటే ఎలక్షన్స్ నడుస్తున్నాయని ట్రోల్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. మా ఎలక్షన్స్ అయిపోయాక కూడా మా కుటుంబాన్ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. కావాలని మా ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న యూట్యూబ్ కంపెనీని గుర్తించాం.
జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లోని ఓ ఐటీ కంపెనీ 21 మంది ఉద్యోగులతో మమ్మల్ని అదే పనిగా ట్రోల్ చేయిస్తోంది. మా ఫ్యామిలీని వేధిస్తోంది. మేమిచ్చిన కంప్లయింట్ ప్రకారం.. సైబర్ పోలీసులు ఆ కంపెనీ ఐపీ అడ్రెస్ లను ఇచ్చారు. అది ఎవరనేది ఇంక్వైరీ చేస్తే.. జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంటున్న ఓ ప్రముఖ నటుడి ఆఫీస్ ఐపీతో మ్యాచ్ అయ్యింది. అలాంటి ఛానల్స్ తో పాటు సినిమా వాళ్ళను, వారి ఫ్యామిలీస్ ని ట్రోల్ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానల్స్ ని మేము గుర్తించాం. గురువారం వారిపై కోర్టులో కేసు నమోదు చేయబోతున్నాం. ఆ చానెల్స్ పై చర్యలు తీసుకునేందుకు, చానల్స్ మూయించేందుకు ఎంతవరకైనా వెళ్తాము. త్వరలోనే పూర్తి వివరాలు బయట పెడతాం” అని చెప్పాడు. ప్రస్తుతం విష్ణు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.